దిశ దశ, మెదక్:
పదవి విరమణ పొందిన రోజే పదోన్నతి పొందారు ఆ అధికారి. అడిషనల్ ఎస్పీగా రిటైర్ కాబోతున్న ఆయనకు ప్రమోషన్ కల్పిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లా అడిషనల్ ఎస్పీ(అడ్మిన్)గా పని చేస్తున్న ఎస్ మహేందర్ మార్చి 31 మంగళవారం పదవి విరమణ చేశారు. మెదక్ జిల్లా పోలీస్ యంత్రాంగం ఆయనకు రిటైర్మెంట్ ఫంక్షన్ చేసేందుకు ఘనంగా ఏర్పాట్లు చేసింది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు వీడ్కోలు సమావేశం నిర్వహించేందుకు సమాయత్తం అయింది. 1989లో ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన మహేందర్ పేరు సీనియారిటీ ప్రకారం పదోన్నతి జాబితాలో ఉంది. అయితే హోంశాఖ అధికారులు ఆయన రిటైర్ అయ్యే రోజునే ఎస్పీగా పదోన్నతి కల్పిస్తూ సీఐడీ విభాగంలో పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. పదవి విరమణ కానున్నరోజే మహేందర్ కు ఎస్పీగా ప్రమోషన్ కల్పించడం విశేషం.