మళ్లీ ఇలా చేస్తే యాక్షన్ తీసుకుంటా… మంత్రి ‘‘అడ్లూరి’’ హెచ్చరిక…

దిశ దశ, ధర్మపురి:

సాధారణంగా అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిధులు వీఐపీలుగా గుర్తించకపోతే ఆగ్రహం వ్యక్తం చేస్తారు… ప్రోటోకాల్ మేరకు నడుచుకోకపోతే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు. కానీ ఈ మంత్రి మాత్రం వైవిద్యంగా సాగుతున్నారు. తన విషయంలో ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అధికార దర్పం ప్రదర్శించేందుకు ప్రతి చోట తమకు ప్రాధాన్యత దక్కాలని భావించే నాయకులు ఉన్న ఈ కాలంలో ఈ అమాత్యుడు మాత్రం ప్రోటోకాల్ అమలు చేస్తే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

మంత్రి ‘‘అడ్లూరి’’

రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి నియోజకవర్గం నుండి శాసన సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆధ్యాత్మికతతో అనుభందం పెనవేసుకున్న ఆయన ధర్మపురి నృసింహ స్వామి ఆలయంలో పూజలు జరిపేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అయితే మంత్రి హోదాలో ఆలయాన్ని సందర్శించేందుకు వచ్చినప్పుడు దేవాదాయ శాఖ అధికారులు భాజాభజంత్రీలు, పూల దండలు, తలకు కండువా చుట్టి పూర్ణ కుంభ స్వాగతం పలకాల్సి ఉంటుంది. ప్రోటోకాల్ కు భిన్నంగా వ్యవహరించినట్టయితే సంబంధిత ఆలయ అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవల్సి ఉంటుంది. అయితే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి ఆలయ ధ్వజ స్తంభం వద్దకు చేరుకున్నారు. ఇంతలో ఆలయ ఈఓ శ్రీనివాస్ అక్కడకు చేరుకుని మంత్రికి సాదర స్వాగతం చెప్పేందుకు సన్నద్దం అయ్యారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెంటనే స్పందించి తన విషయంలో ఇలాంటి మర్యాదలు పాటించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. భాజా భజంత్రీలు, పూల దండలు వేసి హాడావుడి చేయడం వంటి చర్యలు మానుకోవాలన్నారు. తాను ఇంటి మనిషినని, తనకు రాచ మర్యాదలు చేయాల్సిన అవసరం లేదని దేవుని ముందు అంతా సమానమేనని, సాధారణ భక్తుడిలా వచ్చి దర్శనం చేసుకుంటానన్నారు. గతంలో వచ్చినప్పుడే ఇలాంటి చర్యలకు దూరంగా ఉండాలని  చెప్పానని అయినా అదే పద్దతి పాటిస్తుండడం సరికాదన్నారు. మరోసారి ఇలా రిపిట్ అయితే మాత్రం యాక్షన్ తీసుకుంటానని ఆలయ ఈఓను హెచ్చరించారు. అసాధారణమైన స్వాగతం ఇవ్వాలని తపన పడేవారున్న ఈ రోజుల్లో తాను మాత్రం సాధారణ భక్తుడిలా వచ్చి వెల్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రకటించడం ఆదర్శప్రాయంగా నిలిచింది.

adloori laxman kumarDHARMAPURI TEMPLEendomentsJAGITIAL NEWSLatest News
Comments (0)
Add Comment