కొండపాకలో స్టాక్ యార్డ్ వద్దే లోడింగ్…

దిశ దశ, కరీంనగర్:

దర్జాగా మానేరు నదిలోకి లారీలను తీసుకెళ్లి మరీ ఇసుక లోడింగ్ చేస్తున్న తీరుపై ‘దిశ దశ’ వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కొండపాకలోని రెండు ఇసుక రీచుల్లో స్టాక్ యార్డ్ లో కాకుండా మానేరు నదిలోనే లోడింగ్ చేస్తున్నారు కాంట్రాక్టర్లు. నిబంధనలకు విరుద్దంగా సాగుతున్న ఈ తీరుపై వెలుగులోకి తీసుకరాగానే మొదటి రోజు మాత్రం స్టాక్ యార్డ్ వద్దే లోడింగ్ చేయడం ఆరంభించారు. అయితే ఇదే పద్దతిని నిరంతరం అవలంభించాలన్న డిమాండ్ స్థానికంగా వినిపిస్తోంది. మానేరు నదిలోనే ఇసుక లోడింగ్ ప్రక్రియ కొనసాగిస్తుండడం సరికాదన్న విషయాన్ని గమనించి TGMDC అధికారులు కూడా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అంటున్నారు స్థానికులు. ప్రాజెక్ట్ ఆఫీసర్ తో పాటు సిబ్బంది కూడా ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

అర్థరాత్రి..?

మరో వైపున ఇసుక లోడింగ్ విధానాన్ని పగటి పూట కాకుండా రాత్రి వేళల్లో చేపడితే ఎలా ఉంటుందని నిర్వాహకులు ఆలోచిస్తున్నట్టుగా స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అర్థరాత్రి లారీలను నేరుగా మానేరు నదిలోకి తీసుకెళ్లి లోడింగ్ చేసినట్టయితే ఆర్థిక భారం తగ్గుతుందన్న యోచనలో ఉన్నట్టుగా చర్చ సాగుతోంది. ఇదే నిజమైతే మాత్రం చట్టాలకు పని చెప్పాల్సిన ఆవశ్యకత ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సాయంత్రం ఆరు గంటల తరువాత నదిలోకి వాహనాలు వెళ్లడం సహజ వనరులు, సహజ సిద్దమైన జీవ రాశుల ఉనికికే సవాల్ విసిరినట్టు అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. లోడింగ్ విధానానికి మాత్రమే TGMDC రాత్రి 9 గంటల వరకు సమయం ఇచ్చింది కానీ నదుల్లో ఇసుక తవ్వకాలకు మాత్రం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవల్సిన అవసరం ఉంది. భారీ వాహనాలను మానేరు నదిలోకి తీసుకెళ్లి ఇసుక లోడింగ్ చేస్తున్న తీరుపై జిల్లా అధికార యంత్రాంగం కూడా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న అభ్యర్థనలు వినిపిస్తున్నాయి. రూల్స్ బ్రేక్ చేస్తూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్న ఇసుక రీచుల కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అంతేకాకుండా ఇందుకు బాధ్యులైన TGMDC యంత్రాంగంపై కూడా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది.

karimnagarsand lorrysSAND MAFIASAND REACHESTG NEWS
Comments (0)
Add Comment