డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కేసుల్లో అసలేం జరిగింది..?
దిశ దశ, కరీంనగర్:
ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడని ధీమాతో ఉన్నారో ఏమో కానీ… దర్జాగా కోర్టు కేసులను తారు మారు చేసేశారు. కరీంనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో జరిగిన ఈ అవతవకలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసు అధికారులు.
డిస్పోజ్ కేసులు…
మద్యం తాగి వాహనాలను నడిపే వారిని పట్టుకునేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ తనిఖీలలో పట్టుబడ్డ వారిని కోర్టులో హాజరు పర్చినప్పుడు జరిమానా విధించడమో లేక శిక్ష వేయడమో జరుగుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేసి మద్యం సేవించారా లేదా అన్న విషయాన్ని నిర్దారించిన తరువాత వారిని కోర్టులో హాజరు పర్చాల్సిన బాధ్యత వరకే పోలీసులది. అయితే కరీంనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో మాత్రం పాత రికార్డుల ఆధారంగా పెనాల్టీ కట్టేశారని రికార్డులను తారుమారు చేయడం మొదలు పెట్టారు. డిజిటలైజేషన్ కు ముందు డిస్పోజ్ అయిన కేసులకు సంబంధించిన నంబర్లు వేసి తప్పించడం మొదలు పెట్టారు. ఒక్కొక్కరి వద్ద రూ. 30 నుండి 40 వేలు వసూలు చేసి పాత డిస్పోజల్ డిడి కేసు నంబర్లు వేసి తాజా నిందితులను కాపాడే ప్రయత్నం చేశారు.
ఒక్క రోజులోనే…
కరీంనగర్ కు చెందిన ఒకరు డిడి కేసులో పట్టుబడ్డారు. తనకు కొంత మినహాయింపు కల్పించేందుకు చొరవ తీసుకోవాలని ఓ పోలీసు అధికారిని ఆశ్రయించారు. సదరు అధికారి ట్రాఫిక్ పోలీసులను కోరగా స్టేషన్ లో పని చేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు డీల్ మాట్లాడేసుకున్నారు. రూ. 30 వేలు తీసుకుని అతన్ని కోర్టుకు పంపించకుండా క్లోజ్ చేసేశామని చెప్పేశారు. అయితే సదరు వ్యక్తి పోలీసు అధికారి ద్వారా చెప్పిస్తే కూడా తనవద్ద డబ్బులు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం కాస్తా సీపీ గౌష్ ఆలం వద్దకు చేరింది. దీంతో ఆయన ఆ కేసు పుర్వాపరాలు తెలుసుకుని అలెర్ట్ అయ్యారు. ఒక్క రోజులోనే డీడీ కేసులో జరిమానా విధించడం ఏంటీ..? కోర్టులో డిస్పోజ్ అయినట్టుగా వేసిన నంబర్ ఏంటీ అన్న విషయంపై దృష్టి సారించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. సాధారణంగా రెండు మూడు రోజుల తరువాత కానీ డీడీ కేసుల్లోని వ్యక్తులను కోర్టులకు హాజరు పర్చే అవకాశం ఉండదు. కానీ ఒక్క రోజులోనే కోర్టుకు పంపించడం, జరిమానా విధించడం వెనక అసలేం జరిగిందన్న అనుమానంతో ఆరా తీస్తే తప్పిదాలు వెలుగు చూశాయి. ఈ విషయం తెలిసిన వెంటనే ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ట్రాఫిక్ పోలీసు అధికారులకు ఛార్జ్ మెమో ఇచ్చారు సీపీ. ఓ పోలీసు అధికారి తనకేమి తెలియదని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్నవారితో పాటు ఇతర అధికారులు, సిబ్బందిపై నెపం నెట్టే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా సీపీని కలిసి సంజాయిషీ ఇచ్చుకున్న క్రమంలో కన్నీటి పర్యంతం అయ్యారా పోలీసు అధికారి. అయితే ఈ వ్యవహారంపై సమగ్రంగా దర్యాప్తు చేసి వాస్తవ నివేదిక ఇవ్వాలని సీపీ ఆదేశించడంతో సదరు పోలీసు అధికారి ప్రమేయం కూడా ఉందని తేలింది. దాదాపు 135 తాజా కేసుల్లో డిజిటలైజేషన్ కు ముందు డిస్పోజ్ అయిన కేసు నంబర్లు వేసి అసలు నిందితులను తప్పించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారని, ఇందులో సంబంధిత పోలీసుల ప్రమేయం కూడా ఉందని తేలింది. దీంతో బాధ్యులైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్న సీపీ సమగ్రంగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ ఏసీపీకి బాధ్యతలు అప్పగించి పూర్తి స్థాయి నివేదికతో పాటు ఆధారాలను కూడా పంపించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు బయట పడ్డ 135 కేసులే కాకుండా గతంలో డిస్పోజ్ అయిన కేసు నంబర్లు వేసిన తీరుపై పూర్తి వివరాలు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ట్రాఫిక్ పోలీసులు ఈ కేసులకు సంబంధించిన వివరాలు సేకరించే పనిలో నిమగ్నం అయ్యారు.
పైరవీలతో…
అయితే గతంలోనే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ డ్యూటీ చేసిన సదరు పోలీసు అధికారి మళ్లీ అక్కడకే పోస్టింగ్ ఇవ్వాలని అధికారులను పదే పదే అభ్యర్థించడంతో పాటు పైరవీలు కూడా చేయించుకున్నట్టుగా సమాచారం. సాధారణంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న పోలీసులకు 30 శాతం టీఏ అదనంగా ఇచ్చే సాంప్రాదాయం కొనసాగుతోంది. ఇదే కారణంతో సదరు పోలీసు అధికారి ట్రాఫిక్ విభాగంలో పని చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని అనుకున్నారు అధికారులు. కానీ డిస్పోజ్ అయిన డీడీ కేసుల నంబర్లు వేసి కొత్త నిందితుల కొమ్ము కాస్తున్నారని తెలుసుకుని విస్తూ పోయారు. అయితే డిడి కేసుల్లో కోర్టులకు హాజరు కాకుండా తప్పించుకునేందుకు లంచం ఇచ్చి తప్పించుకున్న వారిపై కూడా పోలీసు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనన్న చర్చ కూడా సాగుతోంది. కేవలం పోలీసు విభాగానికి సంబందించిన వారిపైనే కాకుండా చట్టానికి చిక్కకుండా తప్పించుకున్న వారిపై కూడా చర్యలు తీసుకున్నట్టయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కావన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.