ఈ గుడిని చేస్తారా… మా గుడిని బాగు చేసుకోమంటారా..?

అంజన్న భక్తుల లేఖల కలకలం

దిశ దశ, జగిత్యాల:

పవన సుతుడి భక్తులు దేవాదాయ శాఖ తీరుపై మండి పడుతున్నారు. భక్తులకు సౌకర్యాలు కల్పించడం దృష్టి సారించాలంటూ హితవు పలుకుతున్నారు. అంజన్న సన్నిధిలో నెలకొన్న పరిస్థితిపై లేఖలు రాసి హుండీలో వేశారు. శుభ్రత, తాగునీటి వసతి వంటి అంశాలపై కొండగట్లు ఆలయ అధికారులు పట్టించుకోనట్టయితే హుండీలో డబ్బులు వేయమని, ఆ డబ్బుతో తమ గ్రామాల్లోని హనుమాన్ మందిరాలను బాగు చేసుకుంటామని కూడా స్పష్టం చేశారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న క్షేత్రంలోని హుండీ లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. మొక్కులు తీర్చుకునే హుండీల్లో ఈ సారి డిమాండ్లను వినిపించారు భక్తులు గతంలో కొండగట్ట ఆలయ హుండీల్లో డాలర్లు, నగదు, వెండి, బంగారు ఆభరణాలు వేస్తే ఈ సారి లేఖలు వేసి అంజన్న ఆలయంలో నెలకొన్న సమస్యలను ఎకరవు పెట్టడం గమనార్హం. ఇటీవల జరిగిన చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా అంజన్నను దర్శించుకున్న సందర్భంగా భక్తులు ఈ లేఖలను హుండీల్లో వేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఆలయ పరిసరాల్లో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో తాగునీటి సౌకర్యం ఉన్నప్పటికీ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. మరుగు దొడ్లు కూడా లేకపోవడంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, కోనేరుతో పాటు ఆలయ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని భక్తులు అభిప్రాయపడ్డారు.

devoteesendomentskondagattuLatest NewsTG NEWS
Comments (0)
Add Comment