దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ కార్పొరేషన్ పరిపాలనపరంగా విఫలం అవుతోందా..? అధికార యంత్రాంగం అచేతనంగా మారిందా..? ప్రజా ప్రతినిధులకు, అధికారులకు మధ్య సమన్వయం కొరవడుతోందా..? వరస ఘటనలతో బల్దియాలో జరుగుతున్న తీరే చర్చనీయాశంగా మారింది.
కాంట్రాక్టర్లు…
టెండర్లు ఓపెన్ చేస్తున్నప్పుడు ముగ్గురు కాంట్రాక్టర్లు లోపలకు వచ్చిన విషయంలో రగడ చోటు చేసుకుంది. వారిని అధికారులు వారించడంతో ఆగ్రహం వ్యక్తం చేయడంతో కాంట్రాక్టర్లు, అధికారుల మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయిలో జరిగినట్టుగా మునిసిపల్ వర్గాలు చెప్తున్నాయి. ఇరువర్గాలు కూడా ఆగ్రహంతో ఊగిపోవడం… ఈ విషయం కాస్తా మేయర్ వరకూ చేరడం చకాచకా జరిగిపోయింది. మేయర్ జోక్యం చేసుకుని ఇరువర్గాలతో మాట్లాడినట్టుగా చెప్తున్నారు. అయితే అధికారులు మాత్రం నిబంధంనల మేరకు నడుచుకున్న తమను కట్టడి చేస్తున్నారన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మాజీ డిప్యూటీ మేయర్…
కరీంనగర్ కార్పొరేషన్ లో ఒక రూపాయికే అంత్యక్రియలు చేయాలన్న సంకల్పంతో ‘‘ఆఖరీ సఫర్’’ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. నిరుపేదలు, అనాథలు చనిపోయినట్టయితే సంబంధిత కుటంబాలకు చెందిన వారు ఒక రూపాయి చెల్లిస్తే మిగతా సొమ్ము బల్దియా ఖజానా నుండి ఖర్చు చేసి అంత్యక్రియల తంతు పూర్తి చేయాలని నిర్ణయించారు. అయితే నిరుపేద ఒకరు చనిపోవడంతో ఒక రూపాయికే అంత్యక్రియలు కార్యక్రమం ద్వారా అంత్యక్రియలు నిర్వహించాలని మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేష్ భావించారు. ఇందుకు మునిసిపల్ అధికారులు నిబంధనల సాకు చూపిస్తున్నారంటూ రమేష్ ఎంహెచ్ఓ కార్యాలయంలో కుర్చీ విసిరేశారు. ఎంహెచ్ఓ చాంబర్ వద్దకు చేరుకునే సరికి అక్కడ ఎవరూ లేకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయారు. అనంతరం కమిషనర్ ఛాంబర్ ముందు నిరసన వ్యక్తం చేసిన రమేష్ ను బుజ్జగించినప్పటికీ వినలేదు. చివరకు మేయర్ కొలగాని శ్రీనివాస్ రమేష్ తో మాట్లాడి విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. అయితే చనిపోయిన వ్యక్తి వరంగల్ కు చెందిన వాడని అతను స్థానికుడు కానందున మేయర్, కమిషనర్ అనుమతులు తీసుకోవల్సి ఉంటుందని ఎంహెచ్ఓ చెప్తున్నారు. అయితే నిరుపేద చనిపోయిన విషయంపై గుగ్గిళ్లపు రమేష్ మునిసిపల్ కార్యాలయంలో వ్యవహరించిన తీరుపై పోలీసులకు ఫిర్యాదు అందినట్టుగా తెలుస్తోంది. అయితే స్థానికేతరులు చనిపోయినప్పుడు కూడా బల్దియా నిధులు వెచ్చించిన సందర్బాలు ఉన్నాయన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. నాయకులో ఇతర ప్రముఖులో నిరుపేద చనిపోయినందున సాయం అందించాలన్న ప్రతిపాదన వస్తే మాత్రం నిబంధనల సాకు చూపిస్తున్నారన్న ఆరోపణలు కూడా లేకపోలేదు.
టెండర్ల విషయంలో…
మరో వైపున కరీంనగర్ కార్పొరేషన్ లో పనులకు టెండర్లకు పిలిచినప్పుడు కానీ, ఓపెన్ చేసేప్పుడు కానీ మేయర్ కు తెలియకుండానే ఫైళ్లు మూవ్ అవుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో మేయర్ కొలగాని శ్రీనివాస్ కూడా అధికారుల తీరును తప్పుబట్టినట్టుగా బల్దియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతేకాకుండా పనులకు సంబంధించిన ప్రతిపాదనలపై మేయర్ సంతకం చేసినప్పటికీ అప్రూవల్ అన్న పదం రాయలేదన్న కారణంతో పెండింగులో పెడుతున్నారని కొంతమంది కార్పొరేటర్లు వాపోతున్నారు.
కోఆర్డినేషన్..?
అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, నాయకులకు మధ్య సమన్వయం కొరవడినట్టుగా స్పష్టం అవుతోంది. మునిసిపల్ అధికార యంత్రాంగం, కార్పొరేటర్లకు మధ్య నెలకొన్న అంతరం కూడా ఇందుకు కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన పాలకవర్గం, అధికారులు ఒకే మాటగా ముందుకు సాగితేనే అన్నింటా లాభదాయకంగా ఉంటుంది కానీ ఎవరికీ వారే అన్నట్టుగా నడుచుకుంటే మాత్రం కరీంనగర్ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.