దిశ దశ, కాళేశ్వరం:
ఇసుక ఓవర్ లోడ్ విధానంపై కఠినంగా వ్యవహరిస్తున్న టీజీఎండీసీ పార్కింగ్ స్థలాల విషయంలోనూ అదే తీరును ఎందుకు ప్రదర్శించడం లేదు..? రీచుల్లో లోడింగ్ కోసం వస్తున్న లారీల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలు కెటాయించకపోవడానికి కారణమేంటీ..? ఆదాయంపై ఉన్న శ్రద్ద నిబంధనల అమలు విషయంలో నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తోంది..?
కాళేశ్వరం…
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం మీదుగా ప్రవహిస్తున్న గోదావరి నదిపై పలు చోట్ల ఇసుక రీచులను ఏర్పాటు చేసింది టీజీఎండీసీ. అయితే కాళేశ్వరం సమీపంలోని బీరసాగర్ వద్ద ఏర్పాటు చేసిన ఇసుక రీచులో లోడింగ్ కోసం వస్తున్న లారీలకు ప్రత్యేకంగా పార్కింగ్ ప్లేసులు ఏర్పాటు చేయనట్టుగా తెలుస్తోంది. దీంతో జాతీయ రహదారిపైనే లారీలను పార్కింగ్ చేస్తున్నారు. తెలంగాణ, మహారాష్ట్రాలను అనుసంధానం చేసే కాళేశ్వరం అంతరాష్ట్ర వంతెనపై కూడా లారీలను నిలుపుతున్నా పట్టించుకునే వారు లేకుండా పోయారు. ఎక్కడ పడితే అక్కడ లారీలను పార్కింగ్ చేస్తుండడం వల్ల జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. నిత్య కృత్యంగా మారిన లారీల పార్కింగ్ విషయంపై టీజీఎండీసీ అధికారులు ఎందుకు దృష్టి సారించడం లేదో అంతు చిక్కకుండా పోతోంది. టీజీఎండీసీ పీఓ కార్యాలయం సమీపంలోనే ఉన్న లారీల పార్కింగ్ విషయాన్ని పట్టించుకోకపోవడం విస్మ యానికి గురి చేస్తోంది.
నేషనల్ హైవే…
తెలంగాణ నుండి మహారాష్ట్ర, చత్తీస్ గడ్ రాష్ట్రాల రాకపోకలకు అనువుగా మారిన కాళేశ్వరం వారధి కీలకంగా మారింది. ఆయా రాష్ట్రాలకు చెందిన భారీ వాహనాలు దీని మీదుగానే వెల్తుంటాయి. అంతేకాకుండా కాళేశ్వరం ఆలయాన్ని సందర్శించేందుకు కూడా వివిధ రాష్ట్రాల నుండి భక్తులు వస్తుంటారు. ఆలయ దర్శనం కోసం వాహనాల్లో వచ్చే భక్తులు కూడా తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కన్నెపల్లి పంప్ హౌజ్ దారి నుండి వంతెనపై వరకూ ఇసుక లారీలను పార్కింగ్ చేస్తున్నారు.
పార్కింగ్ ప్లేస్..?
అయితే టీజీఎండీసీ ఇసుక రీచులను ఏర్పాటు చేసినప్పుడు పార్కింగ్ ప్లేసులను కూడా కెటాయించాల్సి ఉంటుంది. లోడింగ్ పూర్తయ్యే వరకు కూడా అక్కడే వాహనాలను నిలపాల్సి ఉన్నప్పటికీ ఇందు కోసం ప్రత్యేకంగా స్థలాలను ఏర్పాటు చేయకపోవడం వల్లే ప్రధాన రహదారినే పార్కింగ్ ప్లేస్ గా ఉపయోగించుకుంటున్నారు. ఆదాయం విషయంలో ప్రత్యేక శ్రద్ద వహిస్తున్న టీజీఎండీసీ పార్కింగ్ వంటి సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకోకపోవడం విడ్డూరం.