అప్పుడు డిప్యూటేషన్… ఇప్పుడు రద్దు..!

దేవాదాయ శాఖలో విచిత్రం

దిశ దశ, వేములవాడ:

రాష్ట్ర దేవాదాయ శాఖలో విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారా..? ఆరోపణల పేరిట డిప్యూటేషన్ చేసిన అధికారిని తిరిగి యథాస్థానంలో పోస్టింగ్ ఇవ్వడానికి కారణమేంటీ..? తాజాగా వెలువడిన ఉత్తర్వులు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.

ఆరోపణలు…

యాదగిరిగుట్ట నర్సింహస్వామి ఆలయంలో డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న డి భాస్కర శర్మపై పలు ఆరోపణలు ఉన్నాయని, చాలా కాలంగా ఇదే ఆలయంలో పని చేస్తున్నారని ఇక్కడి నుండి బదిలీ చేయాలని ప్రజా ప్రతినిధుల నుండి మార్చి నెలలో సిఫార్సులు వెళ్లాయి. ఈ మేరకు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ కూడా ఎండార్స్ మెంట్ చేయడంతో పాటు మంత్రి ఓఎస్డీ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాశారు. దీంతో భాస్కర శర్మను రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ ఆలయానికి డిప్యూటేషన్ పై పంపించారు. ఆయన స్థానంలో పి నవిన్ కుమార్ ను నియమించారు. మూడు నెలల తరువాత అదే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భాస్కర్ డిప్యూటేషన్ రద్దు చేస్తూ తిరిగి యాదగిరిగుట్ట నర్సింహస్వామి ఆలయానికి పోస్టింగ్ ఇచ్చారు. వేములవాడ రాజన్న ఆలయ డీఈఓగా నవీన్ కుమార్ ను బదిలీ చేశారు.

మూడు నెలల్లోనే…

యాదగిరిగుట్ట ఆలయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారని మూడు నెలల క్రితం సిఫార్సు లేఖలు ఇచ్చిన తరువాత అసలేం జరిగిందన్నదే అంతుచిక్కకుండా పోయింది. డీఈఓ భాస్కర్ శర్మపై ఆరోపణలు చేస్తూ కీలక ప్రజా ప్రతినిధి ఒకరు లేఖ రాసి  డిప్యూటేషన్ పై పంపించిన ఉన్నతాధికారులు తిరిగి యథాస్థానానికి పోస్టింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. మూడు నెలల్లో ఆయనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి వాటిలో నిజమేమీ లేదని తేల్చారా..? లేక మరేదైనా కారణమా అన్నది మాత్రం తెలియరావడం లేదు. ప్రజా ప్రతినిధి ఇచ్చిన సిఫార్సును పరిగణనలోకి తీసుకున్న అధికారులు అంత త్వరగా తిరిగి యాదాద్రికి పంపించడం వెనక ఆంతర్యం ఏమిటని దేవాదాయ శాఖ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఏది ఏమైనా దేవాదాయ శాఖ అధికారులు తీసుకున్న నిర్ణయంపై మాత్రం హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి.

endomentsLatest NewsTG NEWSvemulawadaYADADRI
Comments (0)
Add Comment