దిశ దశ, కరీంనగర్:
ఓ తండ్రి ఇద్దరు బిడ్డలను దారుణంగా హత్య చేశాడు. ఆడబిడ్డలు పుట్టారన్న కారణంతోనే చంపేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. బిడ్డలు జన్మించినప్పటి నుండి భార్యతో గొడవ పెట్టుకున్న ఆ తండ్రి చివరకు వారిద్దరిని కాటికి పంపిచేశాడు. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం… కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జూబ్లీనగర్ కు చెందిన కచ్చు శ్రీశైలం స్థానికంగా ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. అతని భార్య డెలివరీ కాగా ఇద్దరు కవలలు జన్మించారు. వారికి గీతాన్ శ్రీ, గీతాన్విక అని నామకరణం కూడా చేశారు. అయితే శ్రీశైలం పుట్టిన ఇద్దరు కూడా ఆడబిడ్డలేనన్న కారణంతో తరుచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ విషయంలో వారి బంధువులు కూడా జోక్యం చేసుకుని సర్ది చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇద్దరు ఆడబిడ్డలే పుట్టారన్న విషయం గురించి శుక్రవారం ఉదయం కూడా భార్యతో తగవులాడాడు. ఆ తరువాత బిడ్డలిద్దరికి గడ్డి మందు తాగించి బావిలో పడేసి హత్య చేశాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు శ్రీశైలంను కొట్టి పోలీసులకు అప్పగించారు. బావిలో ఒకరి మృతదేహం దొరకగా మరోకరి కోసం గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కరీంనగర్ రూరల్ సీఐ ఏ నిరంజన్ రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.