దిశ దశ, హైదరాబాద్:
రాష్ట్ర సచివాలయం సాక్షిగా రీల్స్ తీశాడో నకిలీ పోలీస్… ఏకంగా ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ ఇప్పిస్తానంటూ ప్రగల్భాలు పలికాడు. తన గొప్పతనాన్ని చూడండంటూ ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వైరల్ అయిన ఈ రీల్ కాస్తా తెలంగాణ పోలీసు అధికారులకు చేరింది. మొదట పోలీసు శాఖకు చెందిన వ్యక్తేనని అనుమానించినప్పటికీ ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది.
అసలేం జరిగిందంటే…
తెలంగాణ సచివాలయం ముందు పోలీస్ యూనిఫాం వేసుకున్న ఓ వ్యక్తి రీల్ తీశాడు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని కలవాలనుకుంటే తనకు మెసేజ్ చేయాలని కూడా ఓ సలహా ఇచ్చేశాడు నెటిజన్లకు. ఈ రీల్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్ర పోలీసు అధికారులు హై అలెర్ట్ అయ్యారు. అతని కోసం ఆరా తీస్తే ఏపీలోని ఒంగోలుకు చెందిన రవి అలియాస్ నిఖిల్ యాదవ్ అని తేలింది. పోలీసు ఉద్యోగం చేయాలనుకుని విఫలం అయిన రవి పోలీసు వేషంలోనే సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నాడని విచారణలో తేలింది. ఇటీవల తన కుటుంబంతో హైదరాబాద్ కు యూనిఫారంతో వచ్చిన రవి అలియాస్ నిఖిల్ యాదవ్ గేట్ వద్ద సెక్యూరిటీ చేస్తున్న పోలీసు అధికారులను బ్రతిమాలడాడు. తాను ఒక ఫోటో దిగుతానని లోపలకు అనుమతించాలని ప్రాధేయపడడంతో పోలీసులు అతన్ని సచివాలయం లోపలకు అనుమతించారు. అలా వెళ్లిన రవి తన కుటుంబ సభ్యులతో ఫోటో దిగి ఓ రీల్ కూడా తీశాడని పోలీసులు గుర్తించారు. ఈ రీల్ నెట్టింట వైరల్ కావడంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తం కావల్సి వచ్చింది. చివరకు పోలీసులు అతని గురించి వాకబు చేస్తే అతను నకిలీ పోలీసు అని అతనిపై ఏపీలో కూడా ఆరోపణలు ఉన్నాయని తేలింది. రవిని అదుపులోకి తీసుకున్న సైఫాబాద్ పోలీసులు ఛీటింగ్ కేసుతో పాటు ఐటీ యాక్ట్ లలో క్రిమినల్ కేసు నమోదు చేశారు.
యూనిఫాం చూశారా..?
అయితే సచివాలయం వద్ద సెక్యూరిటీ డ్యూటీ చేస్తున్న పోలీసులు రవి అలియాస్ నిఖిల్ యాదవ్ ను లోపలకు ఎలా అనుమతించారన్నదే చర్చనీయాంశంగా మారింది. యూనిఫాంతో వచ్చాడని అతన్ని పోలీసే అని అనుకున్నారా లేక అతను బ్రతిమిలాడినందుకు కూల్ అయ్యారా అన్నదే తేలాల్సి ఉంది. ఒక వేళ యూనిఫాం చూసి పోలీసు విభాగానికి చెందిన వాడేనని డ్యూటీలో ఉన్న అధికారులు నమ్మినట్టయితే అతని మాట తీరు చూసి ఏపీకి చెందిన వాడని గుర్తించే అవకాశం లేకపోలేదు. అయితే అతను యూనిఫాం వేసుకుని సచివాలయానికి రావడం ఏంటన్న అనుమానం రాకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. మరో వైపున అతను ఫ్యామిలీని కూడా వెంటేసుకుని వచ్చాడంటే అతను డ్యూటీలో వచ్చే అవకాశం ఏ మాత్రం ఉండదని గుర్తించలేకపోవడం గమనార్హం. ఏపీ, తెలంగాణ విభజన తరువాత కూడా ఏపీ పోలీసులకు హైదరాబాద్ లో డ్యూటీలు పడే అవకాశాలే చాలా తక్కువ. కనీసం అతని ఐడీ కార్డు అడిగినా వాస్తవం తెలిసేది కదా అన్న చర్చ కూడా సాగుతోంది. ఏపీకి చెందిన వ్యక్తి యూనిఫాం వేసుకుని సచివాలయం వద్దకు డ్యూటీలో రావడానికి ఎలాంటి ఆస్కారం లేదన్నది అందరికీ తెలిసిన విషయమే అలాంటి వ్యక్తి రాగానే లోపలకు వెల్లేందుకు అనుమతించుకుండా పూర్తి వివరాలు సేకరించినట్టయితే అసలు విషయం బయటపడేదని అప్పుడు అతన్ని బయటి నుండే తిప్పి పంపించే అవకాశం ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్ర పరిపాలనకే కేంద్ర బిందువు అయిన సచివాలయంలోకి అనుమతించేప్పుడు ఒకటికి రెండు సార్లు పరిశీలించాల్సిన పోలీసులు ఇలా ఎందుకు అనుమతించారన్నదే అంతు చిక్కకుండా పోతోంది. ఒక వేళ విధ్వంసకర శక్తులు కూడా ఇలా పోలీసు వేషంలో వస్తే ఇలాగే పర్మిషన్ ఇస్తే ఫలితం ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.