గంజాయికి బదులు ఆయిల్… స్మగ్లర్ల సరికొత్త దందా…

వరంగల్ పోలీసుల దాడులతో వెలుగులోకి…

దిశ దశ, వరంగల్:

కిక్కించే గంజాయి అమ్మితే వస్తున్న ఆదాయం జల్సాలకు చాలడం లేదని భావించారు. ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకున్నారు. దీంతో స్మగ్లర్లు సరికొత్త వ్యాపారం మొదలు పెట్టారు. గంజాయి మొక్కల నుండి హాష్ ఆయిల్ తీసి స్మగ్లింగ్ చేసినట్టయితే భారీగా డబ్బు సంపాదించవచ్చని భావించారు. అనుకున్నదే తడవుగా అవసరమైన మిషనరీని సేకరించి హాష్ ఆయిల్ తయారు చేసి అక్రమ రవాణా చేయడం మొదలు పెట్టారు. వరంగల్ కమిషనరేట్ పోలీసులు నిందితులను పట్టుకోవడంతో భారీ రాకెట్ గుట్టు రట్టయింది.

ఒడిషా కేంద్రంగా…

ఒడిషాలోని మల్కాన్ గిరి జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన వారంతా ఓ ముఠాగా ఏర్పడి హాష్ ఆయిల్ స్మగ్లింగ్ చేస్తున్నారని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు. మల్కాన్ గిరి జిల్లా చిత్రకొండ తాలుకా సువ్వపల్లి గ్రామానికి చెందిన హంటల్ సన్ను (23), రేకపల్లికి చెందిన హంటల్ సన్యాసి (23), ఏపీలోని అల్లూరి జిల్లా గూడుం మండలం దారకొండకు చెందిన కండెల చిన్నబాబు (56), రేకపల్లికి చెందిన కృష్ణ హంటల్ (56)లను అరెస్ట్ చేసినట్టు సీపీ వెల్లడించారు. ఈ కేసులో కిలో పాండూ పరారీలో ఉన్నాడని నిందితుల నుండి రూ. 2.50 కోట్ల విలువ చేసే హాష్ ఆయిల్, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని వివరించారు.

స్కెచ్ ఇలా…

ఇంతకాలం గంజాయి అమ్మితే వస్తున్న సొమ్ము చాలడం లేదని హంటల్ సన్ను, కిలో పాండు ద్వారా ఓ పరికరాన్ని తెప్పించారు. దాని సాయంతో గంజాయి మొక్కల నుండి ఆయిల్ తీసి విక్రయించేందుకు అవసరమైన స్కెచ్ వేసుకున్నారు. హంటల్ సన్ను పండించిన గంజాయి మొక్కల నుండి ఈ మిషనరీ ద్వారా దాదాపు 40 కిలోల హాష్ ఆయిల్ తయారు చేశారు. 20 కిలోల హాష్ ఆయిల్ ను పరారీలో ఉన్న పాండూ తీసుకోగా మిగతా 20 కిలోల ఆయిల్ ను కిలో చొప్పున ప్యాకింగ్ చేశారు. ఒక్కొక్కరూ 5 కిలోల హాష్ ఆయిల్ ను ముంబాయి తరలించి సొమ్ము చేసుకోవాలని ఈ నెల 19న తుని రైల్వే స్టేషన్ నుండి కోణార్క్ ట్రైన్ లో బయలు దేరారు. అయితే వరంగల్ చేరుకుంటున్న క్రమంలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారన్న అనుమానంతో అక్కడే దిగిపోయారు. మంగళవారం ఉదయం హాష్ ఆయిల్ ను ముంబాయికి రవాణా చేసేందుకు వరంగల్ బస్ స్టేషన్ సమీపంలో సంచరిస్తున్నారు. అనుమానస్పదంగా తిరుగుతున్న నిందితులు హంటల్ సన్ను, హంటల్ సన్యాసి, కండెల చిన్నబాబు, కృష్ణ హంటల్ లను అరెస్ట్ చేశామని సీపీ సన్ ప్రీత్ సింగ్ వివరించారు. హాష్ ఆయిల్ అక్రమంగా తరలిస్తున్న ముఠాను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, ఏఎస్పీ శుభం, ఏసీపీ జానీ నర్సింహులు, డ్రగ్ కంట్రోల్ టీం ఇన్స్ పెక్టర్లు వై సతీష్, షుకూర్, ఏఏఓ సల్మాన్ పాషా, ఎస్సైలు సందీప్, తేజ, ఆర్ఎస్సైలు ఏ పూర్ణ చందర్ రెడ్డి, కె మనోజ్ రెడ్డి, ఎల్ లింగారావు, క్యాట్ పార్టీ ఏఆర్ఎస్సైలు వి సుబ్బిరామిరెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు బాలరాజు, కె శ్రీరాములు, ఎండీ రబ్బాని, ఆర్ రాజ్ కుమార్ లతో పాటు పోలీసు సిబ్బందిని సీపీ అభినందించారు.

crime newsganjaHash oilmarijuanatelangana police
Comments (0)
Add Comment