దిశ దశ, జగిత్యాల:
కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యాలు చేశారు. రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ పట్టు కోల్పోయిందని, అధిష్టానం సూచనల మేరకు ఆయన నడుచుకోవడం లేదని, ఆయన సూచనలకు అనుగుణంగా పార్టీ నడుస్తోందని వ్యాఖ్యానించారు. బుధవారం జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా మారిపోయిందని… రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో తాను కొనసాగలేనని భావించే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానని స్పష్టం చేశారు. తుమ్మడిహట్టి బ్యారేజీ నిర్మాణం మూడేళ్లయినా నోచుకోలేదని, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ ను దోషిలా చూపించే ప్రయత్నం చేస్తున్నాడని జీవన్ రెడ్డి దుయ్యబట్టారు. పదవులు కావాలనుకుంటే తాను రేవంత్ రెడ్డి వద్దే పడిగాపులు కాసే వాడినని, పదవుల కోసమే తాను బీఆర్ఎస్ పార్టీలో చేరానని ఆరోపించడం విస్మయం కల్గిస్తోందన్నారు. కేసీఆర్ అంటే ప్రజల్లో గౌరవం ఉందని, రేవంత్ రెడ్డిలా లేదని, ఆయన తనను అన్న అని పిలుస్తాడని, ఇద్దరం రాజకీయాల్లో సమకాలీకులమని జీవన్ రెడ్డి వెల్లడించారు. తాను అన్ని పదవులు అనుభవించానని ఒక్క ముఖ్యమంత్రి పదవి తప్ప, రేవంత్ రెడ్డి ఏ పదవి అనుభవించాడో తనకు తెలియదని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సీనియర్లకు గౌరవం ఇస్తామని మీనాక్షి నటరాజన్ ప్రకటించినప్పటికీ ఆచరణలో మాత్రం విఫలం అయిందని, 20 నెలల పాటు క్షోభకు గురయ్యే పార్టీ వీడాల్సి వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా నడుచుకుంటోందని ఆయన చెప్పు చేతల్లోనే పార్టీ కొనసాగుతోందని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, ప్రజల్లో రేవంత్ రెడ్డిపై నమ్మకం సన్నగిల్లిపోతోందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి, రేవంత్ రెడ్డి పోవాలని ప్రజలంటున్నారన్నారు. తాను ఏనాడు కూడా వ్యక్తిగత విమర్శలు చేయలేదని, నిర్మాణాత్మకమైన ఆరోపణలు చేశానన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో తన నియోజకవర్గానికి నిధులు కావాలని అడిగితే విడుదల చేశారని అంతటి గౌరవం తనకు ఆయన వద్ద ఉందని జీవన్ రెడ్డి అన్నారు.