ఫిర్యాదు చేసిన కౌన్సిలర్…
దిశ దశ, చెన్నూరు:
చెన్నూరు మునిసిపాలిటీలో ఫ్లెక్సీ వార్ మొదలైంది. అధికార పార్టీ సభ్యుల ఫోటోలతో కూడిన ఫ్లెక్సీని ప్రదర్శించడంతో బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు ఫ్లెక్సీని తొలగించగా తిరిగి మళ్లీ ఏర్పాటు చేశారు. దీంతో ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లు పోలీసులకు ఫిర్యాదు చేశార. అధికార పార్టీకి చెందిన వారు కావాలనే ఇలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మీటింగ్ రోజున…
చెన్నూరు మునిసిపల్ మీటింగ్ రెండు రోజుల క్రితం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిదులు, మునిసిపల్ ఛైర్ పర్సన్, వైస్ ఛైర్మన్ లో ఫోటోలతో పాటు 11 మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల ఫోటోలతో కూడిన ప్లెక్సీని మునిసిపల్ కార్యాలయం ముందు ఏర్పాటు చేశారు. చెన్నూరు మునిసిపల్ పాలకవర్గ కమిటీ అని కూడా రాయించిన ఈ ఫ్లెక్సీలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన కౌన్సిలర్ల ఫోటోలు ఏర్పాటు చేయకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. తాము కూడా ప్రజలచే ఎన్నుకోబడ్డ వారమేనని తమ ఫోటోలు ఎందుకు వేయలేదని వారు మునిసిపల్ కమిషనర్ ను ప్రశ్నించారు. దీంతో ఫ్లెక్సీని మునిసిపల్ అధికారులు తొలగించడంతో వివాదం సద్దుమణిగిందని భావించారంతా. అనూహ్యంగా తిరిగి అదే ఫ్లెక్సీని మునిసిపల్ ఆవరణలో ఏర్పాటు చేయడంతో ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లు అసహనం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన వారే కౌన్సిలర్లు తాము కాదా అంటూ నిలదీశారు. 7వ వార్డ్ కౌన్సిలర్ కొప్పుల ప్రభాకర్ (బీఆర్ఎస్) స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. దళితుడినైన తనను అగౌరవపర్చడంతో పాటు అవమానానికి గురి చేసే విధంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే విధంగా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభాకర్ కోరారు.