బల్దియాలో ఇష్టారాజ్యమా…
దిశ దశ, కరీంనగర్:
ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకాల విషయంలో CDMAకు నగరపాలక సంస్థ పంపిన నివేదిక మేరకే ప్రకారమే అమలతోందా..? కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో నిబంధనలు అతిక్రమించి మరీ నియామకాలు చేసుకుంటున్న తీరుకు కారణమేంటీ..? స్టేట్ హెడ్ ఆఫీస్ ఇచ్చిన ఆదేశాలు పాటించాల్సిన అవసరం లేదన్న విధానాన్ని కొనసాగుతోందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఈ గణాంకాలు పరిశీలిస్తే.
పొంతన లేని విధానం…
కమిషనర్ అండ్ డైరక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకోవల్సిన మునిసిపాలిటీలు స్వీయ నిర్ణయాలు తీసుకుంటున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరీంనగర్ కార్పొరేషన్ కార్యాలయం యంత్రాంగం చేపట్టిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియమాకాలను పరిశీలిస్తే CDMA ఆదేశాలకు భిన్నంగా సాగుతున్నట్టుగా స్పష్టం అవుతోంది. దీంతో బల్దియాపై అదనపు ఆర్థిక భారం పడుతోందన్న ఆందోళన వ్యక్తం అవుతున్నా పాలకవర్గంలోని కొంతమంది వారికే వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలూ లేకపోలేదు. కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్ లో సాగుతున్న ఈ నియామకాల విషయంలో వాస్తవ నివేదికలు కూడా CDMA కార్యాలయానికి చేరడం లేదని తెలుస్తోంది. CDMA ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటున్నట్టుగా రికార్డులు తయారు చేసి నివేదికలు పంపిస్తున్నారని తెలుస్తోంది. బల్దియాలోని అన్ని విభాగాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోందని CDMA ఆదేశాలకు మించి నియామకాలు జరిగాయని సమాచరం. CDMA నుండి 2026 జనవరి 28 నుండి GO 56 విడుదలైంది. ఈ జీఓ ప్రకారం నగర పాలక సంస్థలో 1480 మంది ఔట్ సోర్సింగ్ యంత్రాంగం పని చేస్తున్నట్లు రిపోర్టు చూపించారు. సిస్టం మేనేజర్లు ఇద్దరికి రూ. 36,140, ఎన్విరాన్ మెంట్ ఇంజనీర్లు ఇద్దరికి రూ. 35 వేలు, పబ్లిక్ హెల్త్ (PH) వర్కర్లు 1152 మందికి రూ. 16,600 చొప్పున, 108 మంది డ్రైవర్లకు రూ. 16,600 చొప్పున, వర్క్ ఇన్సెపెక్టర్లు 26 మందికి రూ. 16,600 చొప్పున, నాన్ పీహెచ్ వర్కర్లు 51 మందికి రూ.15,600 చొప్పున, ఒక సిస్టం అసిస్టెంట్ కు 22,750, 50 మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లకు రూ. 19,500 చొప్పున, 50 మంది ఎలక్ట్రిషియన్లకు 19,500 చొప్పున, ఆపీస్ సబార్డినేటర్లు 38 మందికి రూ, 15,600ల చొప్పున వేతనం ఇవ్వాలని స్పష్టంగా పేర్కొనబడింది. మొదట కార్పొరేషన్ కార్యాలయం అధికారులు ఔట్ సోర్సింగ్ సిబ్బంది ద్వారా పనిచేస్తున్న వారి వివరాలు CDMAకు పంపిన తరువాతే జీఓ విడుదలైంది. అయితే వాస్తవిక పరిస్థితులను గమనిస్తే జీఓకు కార్పొరేషన్ లో జరుగుతున్న నియామాకాల తీరుకు ఏ మాత్రం పొంతన లేకుండా ఉందని స్పష్టమవుతోంది. జీఓ ప్రకారం ఒకే ఒక సిస్టం అసిస్టింట్‌కు మాత్రమే రూ. 22,750 వేతనం ఇవ్వాలని ఉండగా నగరపాలక సంస్థలో 14 మంది పని చేస్తున్నారు. అలాగని వీరు సిస్టం అసిస్టెంట్లు విధులు కాకుండా పారిశుధ్య పనుల పర్యవేక్షణ చేస్తున్నారు. ఇలా CDMA నిర్ణయాలకు విరుద్దంగా దాదాపు 35 మందిని ఔట్ సోర్సింగ్ సిబ్బంది జిఓల్లో లేని వేతనాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఔట్ సోర్సింగ్ నియమకాలు చేసుకునే విషయంలో అధికారులు తమ ఇష్టారాజ్యం అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. రిటైర్డ్ ఉద్యోగులకు ఔట్ సోర్సింగ్ ద్వారా అవకాశం కల్పించకుడదన్న నిబంధనలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం రిటైర్డ్ ఉద్యోగులను నియమించుకునే సాంప్రాదాయం కొనసాగుతుండడం విస్మయం కల్గుతోంది. పెన్షన్ తీసుకుంటున్న వీరికే ఉపాధి కల్పించడం కంటే నిరుద్యోగులకు యువతకు అవకాశం కల్పిస్తే బావుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. శానిటేషన్, ఎస్టాబ్లిష్ మెంట్ విభాగాల్లో రిటైర్డ్ ఉద్యోగులే కీలకంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలూ ఉన్నాయి.
చొరవ తీసుకుంటే…
ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న కరీంనగర్ బల్దియాలో CDMA ఆదేశాలకు భిన్నంగా తీసుకున్న నిర్ణయాలపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించాలన్న అభ్యర్థనలు వినిపిస్తున్నాయి. ఇలా వృథా అవుతున్న నిధులను వెచ్చించకుండా నియంత్రించినట్టయితే కొంతలో కొంత అయినా కార్పొరేషన్ కు ఆర్థికంగా ఊరట కల్గిస్తోందని అంటున్నారు స్థానికులు. ఇవే కాకుండా బల్దియాలోని అన్ని విభాగాలపై రివ్యూ చేసినట్టయితే ముందు ముందు ఎదురు కానున్న ఆర్థిక సంక్షోభాన్ని నిలువరించే అవకాశం ఉంటుందని బల్దియా వర్గాలు అంటున్నాయి.