ఆ క్వారీల యజమానులకు ఉచ్చు బిగుస్తోందా..?

గ్రానైట్ అక్రమాలపై జీఎస్టీ, ఐటీలకు ఫిర్యాదు…

దిశ దశ, కరీంనగర్:

తెలంగాణ విజిలెన్స్ విభాగం ఇచ్చిన అప్రైజల్ రిపోర్ట్ ఆధారంగా జాతీయ దర్యాప్తు సంస్థలకే కాకుండా పలు విభాగాలకు కూడా పిర్యాదులు వెళ్లాయి. అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న క్వారీలపై నిబంధనల ప్రకారం జరిమానాలు విధించాలని కోరుతూ పిటిషన్లు వెళ్లాయి.

అయిపోలేదా..?

జాతీయ దర్యాప్తు సంస్థలు కరీంనగర్ గ్రానైట్ అక్రమాలపై జరిగిన అవకతవకలపై విజిలెన్స్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా సోదాలు చేసిన సంగతి తెలిసిందే. 2022లో ED బృందాలు సోదాలు నిర్వహించిన తరువాత ఈ కేసు మరుగునపడిపోయింది. దీంతో ఆ కథ ముగిసిపోయిందని భావించడమే కాకుండా వ్యవహారం సద్దుమణిగిందన్న ధీమా కూడా వ్యక్తం అయింది. అయితే చాపకింద నీరులా ఆయా విభాగాలకు ఫిర్యాదులు పంపిస్తూనే ఉన్నారు.124 కోట్ల మేర గ్రానైట్ రాయల్టీ చెల్లించకుండాతరలించడంతో నిబంధనల ప్రకారం వన్ ప్లస్ ఫైవ్ పెనాల్టీ వేయాలని విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు నివేదికలో పేర్కొన్నారని వివరించారు. మొత్తం రూ. 749 కోట్ల మేర పెనాల్టీ వసూలు చేయాలని కూడా ఆ నివేదికలో వివరించినట్టుగా వెల్లడించారు. అయితే ఇందుకు సంబంధించిన జీఎస్టీ కూడా ప్రభుత్వానికి అందనట్టయితే నిబంధనల ప్రకారం సదరు గ్రానైట్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు న్యూ ఢిల్లీలోని డైరక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటలీజెన్స్ (DGGI) కార్యాలయానికి ఫిర్యాదు పంపించారు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా నుండి 76888.9 క్యూబిక్ మీటర్ల మేర గ్రానైట్ కు సీనరేజ్ చెల్లించకుండా పోర్టుల నుండి విదేశాలకు ఎగుమతి చేశారని జీఎస్టీ నిబంధనల ప్రకారం సదరు గ్రానైట్ క్వారీలపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఐటీ విభాగానికి…

KP. 124,94,46,147 సీనరేజ్ ఎగవేసినట్టుగా తెలంగాణ విజిలెన్స్ విభాగం ఇచ్చిన అప్రైజల్ రిపోర్ట్ ఆధారంగా ఆదాయపన్ను విభాగం నిబంధనల ప్రకారం పన్నులు వసూలు చేయాలని కోరుతూ మరో పిటిషన్ కుడా పంపించారు. న్యూ ఢిల్లీలోని ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్ కం ట్యాక్స్ విభాగానికి పంపించిన ఈ పిర్యాదులో జరిమానాతో సహా ట్యాక్స్ వసూలు చేయాలని అభ్యర్థించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కార్యాలయానికి, ED, CBIలకు కూడా పలుమార్లు ఫిర్యాదులు పంపించారు.

ఎన్జీటీ…

నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ చెన్నై బెంచ్ కార్యాలయాన్ని కూడా ఆశ్రయించారు. పర్యావరణ నిబంధనలకు విరుద్దంగా సాగుతున్న గ్రానైట్ తవ్వకాల అంశంపై విచారణ జరపాలని కోరారు. ఈ కేసు కూడా NGTలో విచారణ దశలో ఉంది. వివిధ విభాగాలకు కరీంనగర్ గ్రానైట్ స్కాం అక్రమాలపై ఫిర్యాదులు చే్స్తూ సీనరేజ్ ఎగవేసిన క్వారీల చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారు. ఇంతకాలం ఫిర్యాదుల విషయం వెలుగులోకి రాలేదు. తాజాగా తెలంగాణ అసెంబ్లీలో జరిగిన చర్చల్లో గ్రానైట్ అక్రమాలపై విచారణ జరిపిస్తానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సీబీసీఐడీ ద్వారా విచారణకు ఆదేశించడంతో ఫిర్యాదులు చేసిన విషయం బయటకు వచ్చింది.

edgranite scamgranite scam in telanganatg assemblyVigilance enforcement
Comments (0)
Add Comment