స్టేషన్ బెయిల్ పేరిట వసూళ్లు…
దిశ దశ, హైదరాబాద్:
ఏడేళ్ల జైలు శిక్షకు తక్కువగా పడే అవకాశం ఉన్న సెక్షన్లలో కేసులు నమోదయినట్టయితే పోలీస్ స్టేషన్లలోనే నిందితులకు నోటీసులు ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. పోలీసులు ఛార్జిషీట్ కోర్టులో సమర్పించిన తరువాత నిందితులకు సమన్లు జారీ చేయనుంది. ఆ తరువాత నిందితులు కోర్టుకు హాజరు కావల్సి ఉంటుంది. తీవ్రమైన నేరారోపణలకు గురైన కేసుల్లో మాత్రమే నిందితులను కోర్టులో హాజరు పర్చాలన్న ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. దీంతో అప్పటి నుండి కూడా పోలీసులు 7 ఏళ్లలోపు జైలు శిక్ష పడే అవకాశం ఉన్న కేసుల్లో నిందితులకు నోటీసులు ఇచ్చి పంపిస్తున్నారు. ఇది అధికారికంగా సాగుతున్న విధానమే తప్ప ఇందులో నిందితులకు పోలీసులు అధికార దుర్వినియోగం చేసి సహకరించడం ఎంత మాత్రం కాదు. కానీ ఆ ఆదేశాలే అవినీతికి పాల్పడుతున్న కొంతమంది పోలీసు అధికారులకు లాభసాటిగా మారినట్టయింది. ఇటీవల కాలంలో 35(3) BNS (CRPC 41A ) సెక్షన్ ప్రకారం నేరారోపణలకు ఎదుర్కొన్న వారికి నోటీసులు ఇచ్చి పంపిస్తున్నారు. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా నోటీసులు ఇచ్చి పంపించాలని పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతో గత కొంతకాలంగా నిందితులకు నోటీసులు ఇచ్చి పంపించే విధానం అమలవుతోంది.
అదే వారికి వరమా..?
అయితే సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించాలని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం కూడా కొంతమంది పోలీసు అధికారులకు వరంగా మారిపోయినట్టుగా స్పష్టమవుతోంది. ఆదేశాల ప్రకారమే నోటీసులు ఇస్తున్నా నిందితుల నుండి డబ్బులు వసూలు చేసేందుకు కొంతమంది వెనుకాడడం లేదు. స్టేషన్ బెయిల్ పేరిట ఈ నోటీసులు ఇచ్చేందుకు కూడా భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఏసీబీ అధికారులు వివిధ జిల్లాల్లో నమోదు చేసిన ట్రాప్ కేసుల్లో నోటీసులు (స్టేషన్ బెయిల్) కోసం లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఘటనలు కూడా ఉన్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేయడం దేశ వ్యాప్తంగా సర్వ సాధారణంగా మారిపోయినప్పటికీ స్టేషన్ బెయిల్ కోసమంటూ డబ్బులు వసూలు చేస్తున్న తీరు విస్మయానికి గురి చేస్తోంది. మరికొన్ని కేసుల్లో 7 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్లలో కేసు నమోదయితే కూడా స్టేషన్ బెయిల్ ఇవ్వాలన్న విషయంపై స్పష్టత లేదన్న సాకు చూపించి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. ఇలాంటి కేసుల్లో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పోలీసు అధికారులు, స్టేషన్ సిబ్బంది రెడ్ హైండెడ్ గా పట్టుబడుతున్నారు. ఈ ఘటనలపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. నోటీసులు ఇవ్వాలన్న ఆదేశాలను అమలు చేసేందుకు కూడా మామూళ్లు వసూళ్లు చేయడాన్ని నియంత్రించేందుకు ప్రత్యేకంగా చొరవ తీసుకోవల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.