ఆయన అటు ఈయన ఇటు… కలిసి రాని నేతలు…

దిశ దశ, హుజురాబాద్:

వారిద్దరూ ఒకే పార్టీకి చెందిన నాయకులు… ఇద్దరూ కూడా ఎంపీలుగా ఎన్నికైన వారే… ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన వారే… ఇద్దరు కూడా ఒకే అంశంలో జరుగుతున్న పోరాటానికి మద్దతు ఇచ్చేందుకు వచ్చారు. అయినా ఎవరి దారి వారిదే అన్నట్టుగా నడుచుకున్నారు.

హుజురాబాద్

హుజురాబాద్ సమీపంలో డంప్ యార్డ్ ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 25 ఎకరాల్లో డంప్ యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల అనారోగ్యాలకు గురవుతామని, పర్యావరణ సమస్యలు ఉత్పన్నం అవుతాయని ఈ ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డంప్ యార్డ్ ప్రతిపాదిత ప్రాంత పరిసర గ్రామాలతో పాటు హుజురాబాద్ మునిసిపాలిటీ ప్రాంతంలోని వారంతా కలిసి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డారు. డంప్ యార్డ్ కు వ్యతిరేకంగా నిరవధికంగా ఆందోళనలు చేపట్టారు ఈ ప్రాంత వాసులు. వీరి ఆందోళనకు మద్దతుగా, డంప్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా బీజేపీ కూడా తన వంతుగా బాసటనివ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా హుజురాబాద్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ లు పర్యటించారు.

వేర్వేరుగా…

హుజురాబాద్ నుండి గతంలో ప్రాతినిథ్యం వహించిన ఈటల రాజేందర్ శనివారం హుజురాబాద్ కేంద్రంలో నిర్వహిస్తున్న దీక్షా శిబిరానికి చేరుకుని మద్దతు ప్రకటించారు. డంప్ యార్డ్ ఇక్కడ ఏర్పాటు చేయడం ప్రమాదకరమన్నారు. ఇల్లందకుంట రామాలయంలో కూడా పూజలు నిర్వహించిన ఈటల హైదరాబాద్ కు పయనం అయ్యారు. ఆ తరువాత హుజురాబాద్ చేరుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డంప్ యార్డ్ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. అక్కడే మీడియాతో మాట్లాడుతూ… ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. రాష్ట్ర ప్రభుత్వం అక్కడ డంప్ యార్డ్ ఏర్పాటును విరమించుకోవాలని, జనావాసాలు లేని చోటకు తరలించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ఇల్లందకుంట రామాలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఇద్దరి పర్యటనకు దాదాపు 30 నిమిషాల నుండి గంట వ్యత్యాసంలో సాగింది. అయితే ఇద్దరు నాయకులు మాత్రం ఎవరికి వారే తమ షెడ్యూల్ ఫిక్స్ చేసుకోవడం గమనార్హం. ఢిల్లీలో లోకసభ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఇద్దరూ ఢిల్లీ నుండే హైదరాబాద్ చేరుకుని హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించడం మరో విశేషం.

bandi sanjay bjpbjp newsbjp politicseatela rajenderTelangana Politics
Comments (0)
Add Comment