కాళేశ్వరంలో అంగరంగ వైభవంగా వేడుకలు…
సరస్వతి నదికి అంత్య పుష్కరాలు ప్రారంభం…
దిశ దశ, పుష్కరఘాట్ కాళేశ్వరం:
దేశంలోనే అత్యంత అరుదైన నది అంత్య పుష్కర శోభతో ఉట్టిపడుతోంది. ఏడాదిగా సాగిన పుష్కరా ఘట్టం చివరి దశకు చేరుకుంది. మరో 12 రోజుల్లో యమునా నది పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో సరస్వతి నదికి అంత్య పుష్కరాలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాలేశ్వరంలోని గోదావరి, ప్రాణహిత సంగమంలో అంతర్వాహిని సరస్వతి నది కూడా ప్రవహిస్తోంది. ఈ నదికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పుష్కరాలను నిర్వహిస్తోంది. గురువారం ప్రారంభం అయిన అంత్య పుష్కరాలను కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆయన సతీమణి, తెలంగాణ ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కొండా సురేఖ, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ధార్మిక సలహాదారు గోవింద హరి, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ రావు, మల్ రెడ్డి రంగారెడ్డిలు ప్రారంభోత్సవం సందర్బంగా పుష్కర స్నానం ఆచరించారు.
ఆనంద వనం నుండి…
ఉత్తర భారతదేశానికి ప్రయాగరాజ్ మీదుగా ప్రవహిస్తున్న గంగా, యమున, సరస్వతి నదులు, దక్షిణ భారతదేశానికి కాళేశ్వరం వద్ద ప్రవహిస్తున్న గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులకు పుష్కరాలు జరుగుతుంటాయి. చారిత్రక నేపథ్యాన్ని పరిశీలిస్తే ప్రయాగరాజ్ ప్రాంతం నాడు ఆనందవనం అని పిలవబడే ప్రాంతంలో ఉండగా, కాళేశ్వరం దండకారణ్యంలో ఉంది. అయితే దేశంలో 12 నదులకు పుష్కరాలు జరుగుతుండగా ఇందులో ఒక్క ప్రయాగరాజ్, కాళేశ్వరంలో మాత్రమే మూడు నదులకు పుష్కరాలు నిర్వహిస్తారు. దేశంలోనే అత్యంత అరుదైన ప్రాశస్త్యాన్ని ప్రయాగరాజ్, కాళేశ్వరం క్షేత్రాలు సంతరించుకోవడం విశేషం. ప్రయాగరాజ్ లో కుంభమేళ సందర్భంగా లక్షలాదిగా సాదు సంతులు పుణ్య స్నానాలు ఆచరించే సాంప్రాదాయం అదనంగా ఉంది. కానీ మిగతా అన్ని విషయాల్లోనూ ప్రయాగరాజ్ తో కాళేశ్వరం సరిసమానమైన ఘనకీర్తిని చాటుకుంటోంది. సరస్వతి దేవి దేశంలోని కశ్మీర్ లో బాల, బాసరలో జ్ఞాన, కాళేశ్వరంలో మాహా (ఫ్రౌఢ)గా అవతరించింది. దక్షిణాది రాష్ట్రాలలోనే అత్యంత అరుదైన చరిత్రను తనలో ఇముడ్చుకున్న కాళేశ్వరం త్రిలింగ క్షేత్రంగా భాసిల్లుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆలయ రాజగోపురానికి కుడి పక్కన వెలిసి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం కూడా దేశంలో మూడు ప్రత్యేకతలు ఉన్న ఆలయాల్లో ఒకటి కావడం విశేషం. ఒడిశాలోని కోణార్క్, ఏపీలోని శ్రీకాకుళం జిల్లా అరిసెవెల్లి, కాళేశ్వరంలోని శ్రీ సూర్యనారాయణ ఆలయాలు అనుసంధానంగా వెలిశాయి. ప్రపచంలో సూర్యాలయాలు ఎన్నో ఉన్నప్పటికీ ఈ మూడు ఆలయాలకు ప్రత్యేకత ఉందని చరిత్ర చెబుతోంది. ప్రధాన ఆలయంలో కాళేశ్వర, ముక్తీశ్వర లింగాలు ఒకే పానవట్టంపై వెలియగా ముక్తీశ్వరునికి నాసికా రంధ్రాలు ఉంటాయి. వాటిలో ఎంత నీరు పోసినా బయటకు రాకుండా త్రివేణి సంగమంలో కలుస్తుందని పూర్వీకులు చెప్తున్నారు. వేల సంవత్సరాల చరిత్ర ఉన్న కాళేశ్వరం దండకారణ్యంలో ఉండడంతో ఆరాధించే వారు లేక శిథిలావస్థకు చేరుకుంది. శృంగేరీ పీఠాధిపతి సూచనతో 1970., 80వ దశాబ్దాంలో ఆలయ పునరుద్దరణకు నోచుకుంది. ఇంతకాలం ఈ క్షేత్రంలో మూడు నదులకు పుష్కర వేడుకలు నిర్వహిస్తున్నప్పటికీ ఒక్క గోదావరి నది గురించి మాత్రమే ప్రాచూర్యం పొందింది. కానీ ఇటీవల ప్రాణహిత, సరస్వతి నదులకు కూడా ప్రభుత్వం అధికారికంగా నిధులు వెచ్చిస్తుండడంతో మూడు నదులకు పుష్కర శోభ సంతరించుకున్నట్టయింది. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉత్తరాదిన ఉన్న ప్రయాగరాజ్ లో పవిత్ర స్నానాలు చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. కానీ కాళేశ్వరం పుణ్యక్షేత్రమన్న విషయం చాలామందికి తెలియడం లేదు. ఎంతో ఘన చరిత్ర కలిగిన కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలకు నిధులు మంజూరు చేయించి ప్రాధాన్యత దక్కడానికి స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవ తీసుకున్నారు.