ఇంఛార్జి పోస్టు కలిసి రావడం లేదా..? విబేధాల్లో కరీంనగర్ కాంగ్రెస్

దిశ దశ, కరీంనగర్:

కాంగ్రెస్ పార్టీకి ఆ పోస్టు కలిసి రావడం లేదా… ఆ బాధ్యతలు చేపట్టిన వారికి  కలిసి రావడం లేదో అర్థం కావడం లేదు కానీ…  కరీంనగర్ అసెంబ్లీ ఇంఛార్జీలుగా బాధ్యతలు చేపట్టిన వారంతా వ్యతిరేకతను మూటగట్టుకుంటుండడం సరికొత్త చర్చకు దారి తీస్తోంది. ప్రజా క్షేత్రంలో ప్రతికూలతను మూట గట్టుకోవడమో లేక వర్గ పోరులో చిక్కుకుని సతమతమవడం కామన్ గా మారింది. 

2014 నుండి…

కరీంనగర్ నుండి పోటీ చేసి ఓటమి పాలైన చల్మెడ లక్ష్మీ నరసింహరావు ఇంచార్జిగా కొనసాగారు. అయితే స్థానిక నాయకత్వానికి ఆయనకు మధ్య పొసగలేదన్నది బహిరంగ రహస్యం. కరీంనగర్ ముఖ్య నేతకు ఆయనకు మధ్య గ్యాప్ ఏర్పడడంతో ఆయన మిన్నకుండిపోయిన పరిస్థితి. ఆ తరువాత ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పొన్నం ప్రభాకర్ పోటీ చేయగా ఆయన మూడో స్థానానికే పరిమితం కావల్సి వచ్చింది. గత ఎన్నికల నాటికి ఆయన హుస్నాబాద్ నుండి పోటీ చేసి గెలిచారు. 2023 ఎన్నికల్లో పోటీ చేసిన పురుమళ్ల శ్రీనివాస్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ కు మధ్య విబేధాలు పొడసూపాయి. పొన్నంకు వ్యతిరేకంగా డీసీసీ అఫీసులోనే పురుమళ్ల శ్రీనివాస్ సమావేశాలు ఏర్పాటు చేయడంతో క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. సస్పెన్షన్ వేటుకు గురైన ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా కరీంనగర్ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న వెలిచాల రాజేందర్ రావు కూడా పార్టీలో ప్రతికూలతను ఎదుర్కొంటున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తో సఖ్యత లేకపోగా సిటీ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిలతో కూడా అభిప్రాయ బేధాలు నెలకొన్నట్టుగా చర్చ సాగుతోంది. దీంతో కరీంనగర్ ఇంఛార్జిగా బాధ్యతలు చేపట్టిన ప్రతి నాయకుడు కూడా ఏదో విధంగా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్న తీరు విచిత్రంగా మారింది.

నిస్తేజంలో శ్రేణులు…

అర్బన్ బ్యాంక్, కార్పోరేషన్ ఎన్నికల తరువాత కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న విబేధాలు క్యాడర్ ను నిస్తేజంలోకి నెట్టివేస్తున్నాయి. ఇందిరమ్మ కమిటీలు వేయకపోవడంతో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పెండింగులో పడగా, సిటీ, జిల్లా కాంగ్రెస్ కమిటీల నియామకం విషయంలోనూ వర్గ విబేధాలు డ్యామినేట్ చేస్తున్నాయి. దీంతో డీసీసీ అధ్యక్షుడు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులను నియమించిన అధిష్టానం పూర్తి స్థాయి కమిటీలను మాత్రం వేయలేకపోతోంది. అంతే్కాకుండా నామినేటెడ్ పోస్టులకు అర్హులైన వారి జాబితా పంపించే వారు కూడా లేకుండా పోయిందన్న ఆవేదన వ్యక్తం అవుతోంది. ఒకవేళ ఎవరైనా ప్రతిపాదనలు చేస్తూ లేఖలు విడుదల చేస్తే అవి మరుగున పడిపోతున్న పరిస్థితి తయరైందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఎన్నికలప్పుడు అభ్యర్థుల ఖరారు విషయంలో కూడా తాము ప్రతిపాదించిన వారికే అవకాశం ఇవ్వాలని ఒత్తిళ్లు తీసుకవచ్చారు. బహు నాయకత్వం కారణంగా కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నాయి.

karimnagar congressPoliticsTelangana PoliticsTG NEWStpcc
Comments (0)
Add Comment