నేషనల్ హైవేలపై ఇష్టారాజ్యం… ఎమర్జెన్సీ రహదారిపై డ్రమ్ములు…

కాంట్రాక్టర్ తీరుపై చర్యలేవీ..?

దిశ దశ, కాటారం:

జాతీయ రహదారులపై ఏర్పాటు చేసిన టోల్ ప్లాజాల వద్ద ఇష్టారీతిన నడుచుకుంటున్నారు. కాంట్రాక్టర్ల తీరును కట్టడి చేసేందుకు నేషనల్ హైవే అథారిటీ అధికారులు దృష్టి సారించడం లేదు.

353 సి…

NH 353C ద్వారా వరంగల్, మహారాష్ట్రలోని సిరొంచ వరకు అనుసంధానం చేస్తూ రోడ్డు నిర్మాణం జరిపారు. ఈ రహదారి మీదుగా ప్రయాణించే వాహనాల నుండి టోల్ వసూలు చేసేందుకు కాటారం మండలం మేడిపల్లి సమీపంలో ప్లాజా ఏర్పాటుకు నేషనల్ హైవే అథారిటీ అధికారులు అనుమతి ఇచ్చారు. కొంత కాలంగా ఇక్కడ టోల్ వసూలు జరుగుతున్నప్పటికీ ప్లాజాకు ఇరువైపులా వేసిన ఎమర్జెన్సీ రోడ్డు మీదుగా భారీ వాహనాలను వెళ్లకుండా ప్రత్యేకంగా డ్రమ్ములు ఏర్పాటు చేశారు. ఈ రహదారి మీదుగా ద్వి చక్ర, త్రి చక్ర వాహనాలతో పాటు అంబూలెన్సులు, ఫైర్ ఇంజన్లు, పోలీసులు, వీఐపీల వాహనాల రాకపోకలకు అనుమతించాల్సి ఉంటుంది. అయితే కాంట్రాక్టర్ మాత్రం కేవలం, బైకులు, ఆటోలు వెల్లేందుకు అనువుగా డ్రమ్ములను ఏర్పాటు చేసి ఎమర్జెన్సీ వాహనాలను టోల్ ప్లాజా మీదుగా అనుమతిస్తున్నారు. జాతీయ రహదారుల నిబంధనల ప్రకారం ఇక్కడ డ్రమ్ములు ఏర్పాటు చేయడం సరికాదని తెలుస్తోంది. అత్యవసర వాహనాలు వెల్లేందుకు అనువుగా ఇక్కడ టోల్ ప్లాజా కాంట్రాక్టర్ ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి టోల్ చెల్లించకుండా వెల్లే వాహనాలను నియంత్రించవచ్చు కానీ ఏకంగా రోడ్డుపై డ్రమ్ములను ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్దమే. అక్కడ బూమ్ బారియర్ (Boom Barrier) ఏర్పాటు చేసుకునేందుకు నిబంధనలు వర్తిస్తాయి కానీ ఇలా రోడ్డును మూసి వేసే విధంగా చర్యలు తీసుకోవడం మాత్రం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

రేడియం…

టోల్ ప్లాజాకు ఇరువైపులా వేసిన ఎమర్జెన్సీ రహదారిపై ఏర్పాటు చేసిన డ్రమ్ములకు రేడియం స్టిక్కర్లు కూడా వేయలేదు. దీనివల్ల రాత్రి వేళల్లో ఆ రోడ్డు మీదుగా ప్రయాణించే వాహనాదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం కూడా లేకపోలేదు.

ఫిర్యాదు చేయండిలా…

నేషనల్ హైవే అథారిటీ పరిధిలోని రోడ్డలపై నిబంధనలు అమలు కానట్టయితే టోల్ ఫ్రీ నంబర్ 1033 లేదా గూగుల్ ప్లే స్టోర్ లో రాజ్‌మార్గ్ యాత్ర యాప్ (Rajmargyatra App) డౌన్ లోడ్ చేసుకుని ఫిర్యాదు చేయవచ్చు. అలాగే ఈ టోల్ పరిధిలోని 20 కిలో మీటర్ల దూరంలో నివసిస్తున్న వారికి సంబంధించిన నాన్ కమర్షియల్ వాహనాలకు కూడా టోల్ రుసుం నుండి మినహాయింపు ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఆధారాలను టోల్ ప్లాజా వద్ద అందించాల్సి ఉంటుంది.

Latest NewsNational HighwayNH 353CToll PlazaWARANGAL SIRONCHA NH
Comments (0)
Add Comment