సతులతో పాటు పతులు కూడా… అదికారిక కార్యక్రమాల్లో ప్రత్యక్ష్యం….

కరీంనగర్ కార్పొరేషన్ లో విచిత్రం…

దిశ దశ, కరీంనగర్:

మహిళా ప్రజా ప్రతినిధులతో పాటు వారి భర్తలను అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానిస్తుండడం చర్చకు దారి తీస్తోంది.  ప్రజా పాలన… ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వార్డు సభల్లో కార్పొరేటర్లుగా గెలిచిన మహిళా ప్రతినిదులతో పాటు వారి భర్తలు కనిపించడం విశేషం. 

పేరుతో పాటు… 

ప్రజా ప్రతినిధిగా గెలిచిన భార్య పేరుతో పాటు భర్త పేరును శిలాఫలకాలపై చెక్కించే ఆనవాయితీ కొన్నిచోట్ల సాగుతోంది. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే ప్రజా ప్రతినిధులు తమ ప్రసంగంలో మహిళా ప్రజా ప్రతినిధితో పాటు వారి భర్తల పేర్లను పలుకుతుంటారు. కరీంనగర్ కార్పొరేషన్ లో మాత్రం అర్థాంగులతో పాటు వారి భర్తలకు కూడా ప్రత్యేక స్థానాలు కల్పించడం విస్మయానికి గురి చేస్తోంది. ప్రభుత్వ అధికారులు భార్యలతో పాటు భర్తలకు వేదికలపై అవకాశం కల్పించేందుకు మీనామేషాలు లెక్కించేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఈ పద్దతి ప్రొటోకాల్ లో భాగమే అన్నట్టుగా మారిపోయింది.

 

వార్డు సభల్లో…

 కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో మహిళా ప్రజా ప్రతినిదులు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రతి వార్డు సభలోనూ వారి భర్తలను వేదికలపైకి ఆహ్వానించినట్టుగా విమర్శలు వస్తున్నాయి. ఓ డివిజన్ లో అయితే మేయర్, డిప్యూటీ మేయర్, మునిసిపల్ కమిషన్ కూడా వార్డు సభకు హాజరు కాగా అక్కడ కూడా కార్పొరేటర్ భర్త వేదికపై కనిపించారు. దాదాపు ప్రతి వార్డు సభలోనూ ఇదే సాంప్రాదాయాన్ని కొనసాగించారు. బీఆర్ఎస్ హయాంలో అభ్యంతరాలు వ్యక్తం కాగా ఈ సారి మాత్రం ఇది కామన్ అన్నట్టుగా మారిపోయినట్టుగా కనిపిస్తోంది.