దిశ దశ, జగిత్యాల:
బీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు నిర్వహించే విషయంలో అధిష్టానం చర్చలు జరుపుతోంది. ఈ సారి జగిత్యాల జిల్లా కేంద్రంలో సమావేశాలు జరపాలన్న ఆలోచనతో ఉన్నట్టుగా ఉంది. జగిత్యాల సమీపంలో వ్యవసాయ భూముల్లో భారీ ఎత్తున సమావేశం ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అన్న విషయంపై సమాలోచనలు చేస్తున్నట్టుగా సమాచారం. వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న తర్వాత స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
అదే రోజు చేరిక…
మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ప్లీనరీ సమావేశాల్లో జాయిన్ చేసుకోనున్నట్టుగా సమాచారం. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్న నేపథ్యంలో బలమైన సంకేతాలను పంపించేందుకు ప్లీనరీ వేదికను వినియోగించుకోవాలన్న యోచనలో అధినేత కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్లీనరి సభ వేదిక మీదుగానే అధినేత కేసీఆర్ జీవన్ రెడ్డికి అప్పగించే బాధ్యతలను కూడా ప్రకటించనున్నారు.
ఐదేళ్లకు…
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్లీనరీ సమావేశం ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేయడం ఐదేళ్లలో ఇది రెండోసారి. 2021 హుజురాబాద్ బై పోల్స్ సమయంలో కూడా ప్లీనరీ నిర్వహించేందుకు ప్రయత్నాలు చేశారు. ఉప ఎన్నికల్లో సత్తా చాటే విధంగా ప్లీనరీ నిర్వహించి ఈటల రాజేందర్ పై ఆదిపత్యం చెలాయించాలని భావించింది అధిష్టానం. అయితే చివరి క్షణంలో ప్లీనరీ సమావేశం జరిపించే యోచచను విరమించుకున్నారు.
సెండ్ ఆఫ్… వెల్ కం…
ఐదేళ్ల క్రితం ఈటల రాజేందర్ పార్టీ నుండి వెళ్లిపోయిన తరువాత ఉప ఎన్నికల సమయంలో హుజురాబాద్ నియోజకవర్గంలో ప్లీనరీ నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ భావించి వెనక్కి తగ్గింది. అయితే ఇప్పుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్లీనరీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలను పరిశీలిస్తోంది అధిష్టానం.

