అసెంబ్లీలో చర్చ జరిగినా అక్రమ రవాణా ఆగడం లేదా..?

దిశ దశ, కరీంనగర్:

సహజ వనరుల విషయంలో కఠినంగా వ్యవహరించే వారు లేకుండా పోయిందా..? ఖనిజ సంపద అక్రమ రవాణా అవుతున్నా నియంత్రించే వారు లేకుండా పోయారా..? పోర్టుల మీదుగా గ్రానైట్ అక్రమ రవాణా జరిగిందని విజిలెన్స్ ఇచ్చిన రిపోర్టుపై విచారణ జరిపిస్తామని సీఎం అసెంబ్లీలో ప్రకటించినా స్థానిక గ్రానైట్ క్వారీల నుండి మాత్రం నిబంధనలకు విరుద్దంగా అక్రమ రవాణా సాగుతున్నట్టుగా స్పష్టం అవుతోంది. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మార్చి 29న సరైన వేబిల్లులు లేకుండా, ఓవర్ లోడ్ తో పాటు ఇతరాత్రా డాక్యూమెంట్లు లేకుండా తరలిపోతున్న గ్రానైట్ లారీలను పట్టుకున్నారు. ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్, కొత్తపల్లి స్టేషన్ హౌజ్ ఆఫీసర్ సోహం సునీల్ ఈ లారీలను పట్టుకుని ఆరా తీయగా అనుమతికి మించిన గ్రానైట్ తరలిపోతోందని, రవాణా చేస్తున్న వాహనాల్లో సామర్థ్యానికి మించి బ్లాకులు లోడ్ చేసి తరలిస్తున్నారని ఆరు లారీలను సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్దంగా సాగిన అక్రమ రవాణా వాహనాలపై రూ. 12 లక్షలకు పైగా జరిమానా విధించిన తరువాత విడుదల చేశారు అధికారులు. రాఘవ కన్సట్రక్షన్స్ అక్రమాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ అసెంబ్లీలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలో గ్రానైట్ అక్రమాలన్నింటిపైనా విచారణ జరుపుతామని, కరీంనగర్ గ్రానైట్ పై విజిలెన్స్ ఇచ్చిన నివేదికతో పాటు ఇతరాత్ర అంశాలపై కూడా దర్యాప్తు చేసే బాధ్యతలను సీబీసీఐడీకి అప్పగిస్తున్నట్టుగా ప్రకటించారు. ఇదే సమయంలో కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రానైట్ తరలిస్తున్న ఆరు వాహనాలను పట్టుకోవడం గమనార్హం.

విజిలెన్స్ ఏది..?

కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సాగుతున్న గ్రానైట్ క్వారీల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన సంబంధిత శాఖలు అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. శాంతి భద్రతలు పర్యవేక్షించాల్సిన పోలీసులు అక్రమంగా తరలిపోతున్న గ్రానైట్ వాహనాలను పట్టుకుంటున్నా కట్టడి చేయాల్సిన మైనింగ్ విభాగం మాత్రం అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తోంది. వే బిల్లులు జారీ చేయడంతోనే సరిపెట్టుకుంటున్న మైనింగ్ విభాగం అధికారులు గ్రానైట్ క్వారీలపై విజిలెన్స్ చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బాజాప్తాగా ప్రధాన రహదారుల మీదుగా రైల్వే స్టేషన్ లకో, పోర్టులకో తరలిపోతున్న గ్రానైట్ బ్లాకుల విషయంలో దృష్టి సారించేవారు లేకుండా పోయారు. పర్మిట్ కు మించి తరలిపోతున్న గ్రానైట్ విషయంలో క్వారీల వద్దే పరిశీలన చేసినట్టయితే ప్రభుత్వానికి రూ. కోట్లలో ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అలాంటి చొరవ తీసుకునే వారు లేకుండా పోయారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఓవర్ లోడ్…

ఓవర్ లోడ్ విషయంలోకూడా రవాణా విభాగం అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా వాహానాల్లో గ్రానైట్ సామర్థ్యానికి మించి రవాణా చేస్తున్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. స్థానికులు కొంతమంది గ్రానైట్ లారీలను పట్టుకుని రవాణా శాఖ కార్యాలయానికి పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. పోలీసులు పట్టుకుని ఫైన్లు విధించిన సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ రవాణా శాఖ అధికారలు మాత్రం వీటిపై అంతగా దృష్టి సారించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

చెక్ పోస్టులు…

కరీంనగర్ మీదుగా తరలిపోతున్న గ్రానైట్ పర్మిట్లు లేకుండా అక్రమంగా వెలుతోందని, ఓవర్ లోడ్ రవాణా సాగుతోందన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 2014లో స్వరాష్ట్ర కల సాకారం అయిన తరువాత జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి గ్రానైట్ అక్రమాలకు చెక్ పెట్టారు. అయితే కొద్ది రోజులకే ఈ చెక్ పోస్టులు అంతర్థానం కావడం గమానర్హం. ఇసుక ఓవర్ లోడ్ విషయంలో కూడా ఆర్టీఏ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. నెలల వ్యవధిలోనే వాటిని కూడా ఎత్తి వేశారు. వీటికోసం ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్టయితే అక్రమాలను నిలువరించే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.