దిశ దశ, హైదరాబాద్:
మావోయిస్టు పార్టీ తుడిచిపెట్టుకపోయిన నేపథ్యంలో తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మాజీ ప్రజా ప్రతినిధులకు ఉంచిన భద్రతను ఉప సంహరించుకోగా, టు ప్లస్ టు భద్రత ఉన్న వారికి వన్ ప్లస్ వన్ భద్రతకు కుదించారు. అలాగే రాష్ట్ర అత్యున్నత స్థాయి బాధ్యతలు నిర్వర్తించిన అధికారులకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను తొలగించారు. ఇందు కోసం స్టేట్ లెవల్ రివ్యూ కమిటీ సమీక్ష జరిపి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
వారి మాటేమిటో..?
రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు తీసుకున్న ఈ నిర్ణయంతో మరో అంశం తెరపైకి వచ్చింది. వ్యక్తిగత భద్రత కోసం ఇచ్చిన గన్ లైసెన్స్ ల విషయంలో పోలీసు బాసులు ఏ నిర్ణయం తీసుకోనున్నారో అన్న విషయంపై చర్చ సాగుతోంది. టార్గెట్లుగా ఉన్న సాధారణ వ్యక్తులు, పొలిటికల్ లీడర్లు ఆయుధాలు వినియోగించుకునేందుకు ప్రత్యేకంగా లైసెన్సులు ఇచ్చారు. నక్సలిజం అంతరించి పోయిన ఈ నేపథ్యంలో స్వీయ రక్షణ కోసం ఇచ్చిన ఆయుధ లైసెన్సులు రద్దు చేస్తారా యథా విధిగా కొనసాగిస్తారా అన్న విషయంపై స్పష్టత లేకుండా పోయింది. తెలంగాణలో చాలా వరకు నక్సల్స్ టార్గెట్ అన్న కారణం చూపే ఆయుధ లైసెన్స్ తీసుకున్న వారు ఉన్నారు. వ్యాపార, వాణిజ్య వర్గాలకు చెందిన వారికి కూడా గన్ లైసెన్స్ ఉన్నప్పటికీ నక్సల్స్ టార్గెట్ గా అనుమతి తీసుకున్న వారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని చాలా వరకూ ఎదురు చూస్తున్నారు. మావోయిస్టులే లేరని అంగరక్షకులను తొలగించిన రివ్యూ కమిటీ ఈ కారణంగా టార్గెట్ అయిన వారికి ఇచ్చిన వ్యక్తిగత లైసెన్సులు రద్దు చేస్తారా లేక అలాగే కొనసాగిస్తారా అన్న చర్చ సాగుతోంది. మావోయిస్టు పార్టీ ఉనికి లేకుండా పోయిన నేపథ్యంలో వ్యక్తిగతంగా ఇచ్చిన లైసెన్సులు కూడా రద్దు చేయాలన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. టార్గెట్లే అయినప్పటికీ నక్సల్స్ లేనందున వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశాలు ఏ మాత్రం ఉండవని అలాంటప్పుడు వారికి ఇచ్చిన గన్ లైసెన్సులు రద్దు చేస్తే తప్పేముంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో కూడా లైసెన్సులు తీసుకున్నారన్న ప్రచారం కూడా ఉన్నందున ఈ విషయంలో కూడా రివ్యూ కమిటీ దృష్టి సారిస్తే బావుంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
దుర్వినియోగం..?
కొన్ని సందర్భాల్లో వ్యక్తిగతంగా వినియోగిస్తున్న లైసెన్సుడు గన్స్ దుర్వినియోగం అవుతున్నాయన్న ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది. సెటిల్ మెంట్లతో పాటు ఇతరాత్ర పంచాయితీల్లో గన్ ఉన్నట్టుగా అందరికి కనిపించే విధంగా చూపిస్తూ పరోక్షంగా బెదిరింపులకు గురి చేస్తున్నారన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. వాస్తవంగా తమ వద్ద ఉన్న తుపాకిని ప్రాణ రక్షణ సమయంలో మాత్రమే వినియోగించాలని ఉన్నా చాలా మంది అందరికి కనిపించే విధంగా చూపిస్తూన్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. గన్స్ షో చేస్తూ ఇష్టారీతిన నడుచుకుంటున్న వారిపై ఫిర్యాదు చేసే ధైర్యం లేక చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా చూపించాల్సి ఉంటుందని లైసెన్స్ గన్ చూపించినప్పుడు వీడియోలు, ఫోటోలు తీసే పరిస్థితి లేకపోవడంతో ఫిర్యాదు చేయలేకపోతున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా మావోయిస్టు పార్టీతో ఇతర విప్లవ గ్రూపుల టార్గెట్లకు ఇచ్చిన ఆయుధ లైసెన్సులు రద్దు చేస్తేనే అన్నింటా మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి,

