దిశ దశ, కరీంనగర్:
మనిసన్నాక కూసింత కళాపోషణ ఉండాలి అన్న నానుడికి అచ్చు గుద్దునట్టుగా సరిపోతారీ వైద్యులు… పేషెంట్లకు మత్తు ఇంజక్షన్ ఇచ్చే వృత్తితోనే సరిపెట్టే వాళ్లం కాదు మేము… తమలోని కళలను ప్రదర్శించి సభికులనూ మత్తులోకి దింపేస్తామంటున్నారు. ఆసుపత్రిలో పేషంట్లను అక్కున చేర్చుకుంటే వేదికలపై నటనా కౌశల్యాన్ని ప్రదర్శించి అందరినీ ఆకట్టుకుంటామంటున్నారు. కరీంనగర్ వి కన్వెన్షన్ హాల్ లో ‘‘ది ఇండియన్ సొసైటీ ఆఫ్ ఆఫ్ అనెస్తీషియాలాజిస్ట్స్, తెలంగాణ (ISACON TG 2026) సెమినార్లు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని అనెస్తీషియా డాక్టర్లంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నేషనల్, స్టేట్ లెవల్ ప్రతినిధులు హాజరైన ఈ సమావేశాల్లో వైద్య రంగంలో అనెస్తీషియా డాక్టర్లు అందిస్తున్న సేవలు, మెరుగు పర్చుకోవాల్సిన అంశాలపై చర్చిస్తున్నారు. అయితే ఎప్పుడూ వైద్యం అందించే బిజీలో ఉండే డాక్టర్లు రాత్రి పూట నిర్వహిస్తున్న కార్యక్రమాలు సభికులను ఆకట్టుకుంటున్నాయి. కరీంనగర్ కు చెందిన మీనాక్షి హస్పిటల్ డాక్టర్ ఎస్ రవికుమార్, డాక్టర్ రత్నాకర్, డాక్టర్ ఈశ్వర్, డాక్టర్ రమేష్, డాక్టర్ మనీష్ లతో పాటు ప్రతిమ, చల్మెడ మెడికల్ కాలేజీలకు చెందిన పలువురు మహిళా డాక్టర్లు తమలోని కళలను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు.
ఓల్డ్ ఈజ్ గోల్డ్…
నా మది నిన్ను పిలిచింది గానమై వేణు… గానమై… నా ప్రాణమై… గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం వంటి పాత పాటలపై నాట్య ప్రదర్శన చేశారు. అప్పటి వరకూ వైద్య వృత్తిలో మత్తు డాక్టర్లు అందించాల్సిన సేవల గురించి సీరియస్ గా ప్రసంగాల పర్వం సాగగా… రాత్రి డాక్టర్లు చేసిన నృత్యంతో సభ వేదికా అంతో ఫుల్ జోష్ లో ఈలలు, అరుపులతో నిండిపోయింది. ఈ సెమినార్ కు హాజరైన వైద్యులు తమ సహచరుల కళా నైపుణ్యాన్ని చూసి అబ్బురపడిపోయారు. ముఖ్య నాయకుల నుండి ప్రతి ఒక్కరు కూడా వీరి ప్రదర్శనను తిలకించి ఆనందంలో మునిగి తేలారు. వైద్యుల నటనతో వి కన్వెష్షన్ హాల్ అంతా ఊర్రూతలూగిపోయింది.


