దిశ దశ, హైదరాబాద్:
హైదరాబాద్ మలక్ పేటలోని ఓ ఇంటి కేంద్రంగా గంజాయి అమ్మకాలు సాగుతున్నాయని సమాచారం అందుకున్నారు ఎక్సైజ్ అధికారులు. పక్కాగా స్కెచ్ వేసి అతని ఇంట్లో దాడులు చేపట్టారు. అయితే ఆ ఇంట్లో నామ మాత్రంగానే గంజాయి లభ్యం అయినా… నోట్ల కట్టలు చూసి అధికారులు నివ్వెరపోయారు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… మలక్ పేట్ గన్నీ బజార్ మెహందీ గల్లీలోని ఓ ఇంటి కేంద్రంగా గంజాయి అమ్మకాలు సాగుతున్నాయని ఎక్సైజ్ అధికారులు సమాచారం అందుకున్నారు. ఇందులో భాగంగా బుధవారం అరుణ్ కరర్ అనే వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన అరుణ్ కరర్ గంజాయిని విక్రయిస్తున్నాడన్న సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. సదరు ఇంట్లో 450 గ్రాముల గంజాయితో పటు రూ. 7.59 లక్షల నగదు కూడా లభ్యం అయింది. ఈ నగదు ఎక్కడి నుండి వచ్చింది..? గంజాయి విక్రయం ద్వారానే సంపాదించాడా అన్న విషయంపై స్పష్టత లేకుండా పోయిందని ఎక్సైజ్ సూపరింటిండెంట్ విజయ్ భాస్కర్ గౌడ్ తెలిపారు. నిందితుని నుండి పూర్తి వివరాలు సేకరించే పనిలో నిమగ్నం అయ్యామని వెల్లడించారు. ఈ దాడుల్లో గంజాయి, నగదుతో పాటు రెండు డిజిటల్ వెయింగ్ మిషన్లు, పాలథీన్ కవర్లు, మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మలక్ పేట ఎక్సైజ్ సీఐ నరేందర్, ఎస్సై ఫాతిమాలు ఈ దాడుల్లో పాల్గొన్నారు.

