వితంతు ఫించన్ మంజూరు కోసం లంచం..!

దిశ దశ, కరీంనగర్:

వితంతు ఫించన్ మంజూరు కోసం లంచం డిమాండ్ చేసిన పంచాయితీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కరీంనగర్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సెక్రటరీని ట్రాప్ చేశారు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి 2022లో మరణించాడు. అతని భార్యకు తెలంగాణా చేయూత పథకం ద్వారా వితంతు ఫించన్ మంజూరు చేయించాలని పంచాయితీ కార్యదర్శి లావుడ్యా చవన్ లాల్ ను మృతుని తండ్రి కలిశాడు. తన కోడలికి వితంతు ఫించన్ మంజూరు చేయాలని అభ్యర్థించగా రూ. 10 వేలు లంచం ఇవ్వాలని కార్యదర్శి డిమాండ్ చేశాడు. దీంతో అతను కరీంనగర్ ఏసీబీ అధికారులను సంప్రదించగా శనివారం లంచం తీసుకుంటున్న కార్యదర్శి చవన్ లాల్ ను పట్టుకున్నారు. ఫినాప్తలిన్ టెస్ట్ నిర్వహించిన ఏసీబీ అధికారులు కార్యదర్శిని అరెస్ట్ చేసి కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు.