దిశ దశ, హైదరాబాద్:
కల్వకుంట్ల కుటుంబం నుండి మరో పార్టీ ఆవిర్భవించింది. ఉద్యమనేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసి స్వరాష్ట్ర కల సాకారం చేయడంలో సఫలం అయ్యారు. ఆ తరువాత రెండు సార్లు గద్దెనెక్కిన ఉద్యమ పార్టీలోనే కొనసాగిన ఆయన తనయ కవిత మరో కొత్త పార్టీ పెట్టారు. అయితే ఈ పార్టీ పేరు కూడా TRSగానే పిలవాల్సి వస్తోంది. తెలంగాణ రాష్ట్ర సేనగా కవిత తన పార్టీ పేరును ప్రకటించారు. ఈ మేరకు శనివారం పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించి ఈ విషయాన్ని వెల్లడించారు.
ఆ పదం..?
తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ పేరుతో పాటు కింద చిన్న అక్షరాలతో కనిపిస్తున్న మరో పదం ఎందుకు చేర్చారన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్ర సేన అని పెద్ద అక్షరాలతో రాసి కింద మాత్రం అసోసియేషన్ (ASSOCIATION) అనే పదం చిన్న అక్షరాల్లో రాసి ఉంది. కవిత కొత్తగా ఏర్పాటు చేసిన పొలిటికల్ పార్టీ కేవలం టీఆర్ఎస్ మాత్రమే కాదని అసోసియేషన్ కూడా జత చేశారన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ రికార్డుల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఉండడంతో ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చే అవకాశం లేదు. అయితే తెలంగాణ రాష్ట్ర సమితికి బదులు తెలంగాణ రాష్ట్ర సేన అని పేరు పెట్టినా దీనిని కూడా TRS అని పిలవాల్సిందే. దీనిపై కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం చెప్పే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకైతే తెలంగాణ రాష్ట్ర సేన పేరిట పార్టీ రిజిస్ట్రేషన్ అయినట్టుగా లేదు. కానీ ఆమె మాత్రం తన పార్టీ పేరును మాత్రం ప్రకటించారు. పేరు కింద అసోసియేషన్ అని చిన్న అక్షరాలతో రాయడానికి కారణం తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ అన్న పేరుతో ఎన్నికల కమిషన్ వద్ద పార్టీని రిజిస్ట్రేషన్ చేసుకుంటారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనివల్ల లీగల్ సమస్యలు ఎదురు కావన్న ఆలోచనతోనే ఈ పేరును ఎంచుకుని ఉంటుందని భావిస్తున్నారు.
మరి గుర్తో..?
టీఆర్ఎస్ పార్టీ అన్నది తెలంగాణ ప్రజల్లో బలంగా నాటుకపోయింది వాస్తవమే అయితే తాను ఏర్పాటు చేసిన పార్టీ కూడా టీఆర్ఎసేనని ప్రజలకు చెప్పడం సులువు అవుతుందని దీనివల్ల పార్టీకి గుర్తింపు త్వరగా వస్తుందని అంచనా వేసి ఉంటారని అనుకుంటున్నారు. అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే తెలంగాణ ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీది కారు గుర్తు అన్న విషయం బలంగా నాటుకపోయింది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మార్చుకున్నప్పటికీ కారు గుర్తు మాత్రం ఆ పార్టీకే అలాట్ అయి ఉంది. టీఆర్ఎస్ పార్టీని ప్రజల్లో బలంగా నాటుకపోయేందుకు శ్రమించాల్సిన అవసరం లేకున్నా పార్టీ గుర్తు ప్రజల్లో నాటుకపోయేందుకు శ్రమించాల్సి ఉంటుంది. లేనట్టయితే కారు గుర్తు టీఆర్ఎస్ పార్టీదేనని ఓటర్లు భావించినట్టయితే కవిత పార్టీకి మొదటికే మోసం అవుతుంది.

