దారి తప్పుతున్న యువత… ఏమిటి వారి భవిత..?

దిశ దశ, కరీంనగర్:

మత్తుకు యువత బానిసగా మారిపోతోంది. మాఫియా పడగ నీడలో చిక్కుకుని బలైపోతోంది. గుట్టుగా కరీంనగర్ చేరుకుంటున్న మత్తు పదార్థాలు చేతులు మారుతూ యువతరం వద్దకు వచ్చి చేరుకుంటున్నాయి.

త్రిశంకు స్వర్గం…

మత్తు పదార్థాలకు అలవాటు పడిన యువత వాటి కోసం వెంపర్లాడే పరిస్థితి వచ్చింది. గంజాయి, హాష్ ఆయిల్, మత్తు ట్యాబ్లెట్లతో మత్తులో జోగుతున్నారు. 24 గంటల పాటు మత్తులో ఉండేందుకు అనువుగా ఉండే వాటిని వెతికి మరీ కొనుగోలు చేస్తున్నారు. మత్తు పదార్థాలు తీసుకున్న తరువాత ఊహా లోకల్లో తేలిపోతూ… అదే జీవితంగా బ్రతుకుతున్నారు.

చుక్క… ఐదుగురు…

గంజాయికి ప్రత్యామ్నాయంగా హాష్ ఆయిల్ మార్కెట్ లోకి వచ్చి చేరుతోంది. ఒడిషాలో తయారవుతున్న ఈ హాష్ ఆయిల్ తెలంగాణాలోని వివిధ ప్రాంతాలకు గుట్టుగా చేరిపోతోంది. అక్కడ రూ. 20 లక్షలకు లీటర్ లభ్యం అయ్యే ఈ హాష్ ఆయిల్ తెలంగాణాలో రూ. 30 నుండి 40 లక్షల వరకు విక్రయిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే హాష్ ఆయిల్ స్మగ్లర్లు రిటేలర్స్ కు సరఫరా చేస్తుంటే వారు ఒక్కో చుక్క చొప్పున అమ్మకాలు చేస్తున్నారు. ఒక డ్రాప్ హాష్ ఆయిల్ కు రూ. 4 నుండి 5 వేలు వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. హాష్ ఆయిల్ డ్రాప్ ను వేడి నీటిలో వేసి ఆవిరి పీల్చిన వారు మత్తుతో మాయా ప్రపంచంలోకి చేరుపోతుంటారు. ఒక్కో డ్రాప్ హాష్ ఆయిల్ ను ఐదుగురు పీల్చుతారని వీరంతా ఒక రోజంతా కూడా మత్తులోనే ఉండిపోతారని తెలుస్తోంది.

ట్యాబెట్ల్స్…

మత్తు ట్యాబెట్లకు కూడా మార్కెట్ లో విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. క్వాలిఫైడ్ డాక్టర్లు ప్రిస్కిప్షన్ ఆధారంగా మత్రమే విక్రయించాల్సిన మత్తు ట్యాబెట్లను మెడికల్ షాపు యజమానులు ఇష్టారీతిన విక్రయిస్తున్నారు. ఇటీవల కరీంనగర్ లో ఓ మెడికల్ షాపుపై కరీంనగర్ రూరల్ పోలీసులు సోదాలు చేసి నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కంట్రోల్ అధికారులు కూడా రంగంలోకి దిగి సదరు మెడికల్ షాపును సీజ్ చేశారు. అయితే మత్తు ట్యాబ్లెట్లను లిక్విడ్ గా మార్చుకుని నేరుగా ఇంజక్షన్ చేసుకుంటోంది మత్తుకు బానిసైన యువత. చేతులపై నరాలను కట్ చేసి డైరెక్ట్ గా మత్తు ఇంజక్షన్లు తీసుకుంటున్నారు. దీనికి బానిసలుగా మారిన యువత మెడికల్ షాపుల్లో రెట్టింపు ధరలు చెల్లించి మరీ మత్తు ట్యాబ్లెట్లు కొనుగోలు చేస్తున్నారు.

రూరల్ పోలీసులు…

కరీంనగర్ రూరల్ పోలీసులు మత్తుకు బానిసైన యువతను కట్టడి చేసే పనిలో పడ్డారు. ఇటీవల కొంతమంది యువతను అరెస్ట్ చేసిన పోలీసులు మత్తు పదార్థాల రాకెట్ కోసం అన్వేషణ మొదలు పెట్టారు. మత్తుకు బానిసైన వారి నుండి సేకరించిన వివరాలు పోలీసు అధికారులను విస్తుపోయేలా చేశాయి. యువత పెడదారులు తొక్కుతున్న తీరు వారిని అప్రమత్తం చేసినట్టయింది. డ్రగ్స్ క్రయవిక్రయలపై ఉక్కుపాదం మోపాలని భావిస్తున్నారు. కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి నేతృత్వంలో  డ్రగ్స్ గుట్టును రట్టు చేశారు. అయితే ఈ నెట్ వర్క్ ను ఛేదించాలన్న లక్ష్యంతో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది.