మూడు రాష్ట్రాల్లో బృందాలు… కొలిక్కి వస్తున్న పోలీసుల వేట…?

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ నగల షోరూంలో దోపిడీకి పాల్పడిన ముఠా  సభ్యుల ఆచూకి దాదాపుగా దొరికినట్టేనని సమాచారం. మూడు రాష్ట్రాల్లో తెలంగాణ పోలీసు బృందాలు సెర్చింగ్ ఆపరేషన్  కొనసాగిస్తున్నాయి. మొదట మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాలకు  చెందిన వారు మాత్రమే ఉన్నారని భావించినప్పటికీ వారి గురించి సమగ్ర సమాచారం తెలుసుకోవడంలో  పోలీసులు సక్సెస్ అయ్యారు. పశ్చిమ బెంగాల్, బీహార్, రాజస్తాన్ రాష్ట్రాలకు చెందిన వారంతా కలిసి ఓ ముఠాగా ఏర్పడినట్టుగా తెలుస్తోంది.

జైలు పరిచయం… 

వివిధ రాష్ట్రాలలో  దోపిడీలకు పాల్పడిన వీరు వేర్వేరు కేసుల్లో అరెస్ట్ అయి జైలు జీవితం గడిపారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం కాస్తా జాతీయ ముఠాగా తయారైనట్టుగా తెలుస్తోంది. జట్టు కట్టిన వీరు దేశంలోని వివిధ ప్రాంతాల్లో దోపిడీలకు పాల్పడుతూ పెద్ద ఎత్తున సొత్తు ఎత్తుకెల్తుంటారని పోలీసుల దర్యాప్తులో  తేలింది. ఓ సారి ఉత్తర భారతంలో దోపిడీ  చేస్తే మరోసారి ఈశాన్య రాష్ట్రాలలో మూడో సారి మధ్య భారతంలో ఇలా సంబంధం లేని ప్రాంతాల్లో సంచరిస్తూ రెక్కీ చేసి దోపిడీ చేస్తూ నిఘా వర్గాలకు సైతం దొరకకుండా తప్పించుకుంటున్నారని తెలుస్తోంది. అయితే కరీంనగర్ పోలీసుల  బహుముఖ వ్యూహంతో ఎట్టకేలకు ఈ దోపిడీ ముఠా గుట్టు రట్టయినట్టుగా విశ్వసనీయంగా తెలిసింది.

రికవరీ..? 

కరీంనగర్ PMJ Jewellery Showroomలో దోపిడీ చేసిన ముఠా సభ్యుల ఆచూకి కొంతమేర పశ్చిమ బెంగాల్ లో దొరికినట్టుగా తెలుస్తోంది. పోలీసులు  అందుకున్న కీలక సమాచారంలో భాగంగా దోపిడీ  ముఠా నుండి సొత్తు రికవరీ చేసినట్టుగా తెలుస్తున్నది. మిగతా ముఠా సభ్యుల కోసం బీహార్, రాజస్తాన్ రాష్ట్రాలలో గాలిస్తున్నట్టుగా సమాాచారం. అయితే పోలీసు అధికారులు మాత్రం ఈ విషయాన్ని అధికారికంగా దృవీకరించడం లేదు.

యాక్సిడెంట్..? 

ఈ నెల 3వ తేదిన కరీంనగర్ లో దోపిడీకి పాల్పడిన ముఠా బైకులపై తిరుగి వెల్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం నుండి తప్పించుకున్నట్టుగా సమాచారం. రామడుగు మండలం వెదిర సమీపంలో రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నట్టుగా విశ్వసనీయ సమాచారం. అక్కడ రోడ్డు ప్రమాదం జరిగినట్టయితే నగల  దుకాణంలో దోపిడీ చిక్కుముడి అదే రోజున వీడిపోయేది. కానీ ప్రమాదం తప్పడంతో గ్యాంగ్ పోలీసులకు చిక్కలేదు.

సెల్ ఫోన్ ధ్వంసం..? 

మరో వైపున ఈ దోపిడీ ముఠా సాంకేతిక విషయంలో  కూడాా పరిపూర్ణమైన అవగాహన చేసుకున్నట్టుగా ఉంది. మార్గ మధ్యలో వారి వద్ద ఉన్న మొబైల్ ఫోన్ ను బండకు వేసి కొట్టి ధ్వంసం చేశారు. ఈ మొబైల్ ఫోన్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఫోన్ ధ్వంసం చేసినట్టయితే దాని ఆధారంగా పోలీసులు తమను పట్టుకోలేరన్న నమ్మకంతోనే పగలగొట్టినట్టుగా భావిస్తున్నారు. 

పలు చోట్ల… 

ఇకపోతే దోపిడీ  ముఠా ఒక్క కరీంనగర్ జ్యువెలరీ షోరూంను మాత్రమే టార్గెట్ చేసుకోనట్టుగా సమాచారం. జగిత్యాల, సిద్దిపేటలలో కూడా అనువైన  ప్రదేశం కోసం ఆరా తీసినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. దోపిడీ చేసేందుకు అనువుగా ఉన్న షోరూం గురించి ఆయా ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి చివరకు కరీంనగర్ PMJ Jewellery Showroomను ఎంచుకున్నట్టుగా నిర్దారించారు  పోలీసులు. ఏది ఏమైనా ఈ ముఠా గురించి  సమగ్ర వివరాలు సేకరించడంలో కరీంనగర్ టీమ్స్ సక్సెస్ అయినట్టేనని స్పష్టం అవుతోంది.