CPOలో వేతనాల గోల్ మాల్…
దిశ దశ, కరీంనగర్:
దాదాపు 30 ఏళ్లుగా అటాచ్డ్ డ్యూటీ చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ను డ్యూటీ నుండి తప్పించినప్పటికీ బిల్లులు తయారు చేసే పని ఆయన చేతుల మీదుగానే సాగినట్టుగా తెలుస్తోంది. ఆ స్థానంలో కొత్తగా వచ్చిన ఉద్యోగిని వారించి మరీ ఆ హెడ్ కానిస్టేబుల్ కే ప్రాధాన్యత ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది.
అసలేం జరిగిందంటే..?
కరీంనగర్ కమిషనరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులో సుదీర్ఘ కాలంగా పని చేస్తున్న నీలం రామ్మోహన్ అటాచ్డ్ డ్యూటీ నుండి అధికారులు గత సంవత్సరమే తప్పించినట్టుగా తెలుస్తోంది. అయితే ఆయనకు పోస్టింగ్ ఇచ్చిన చోటకు వెళ్లకుండా సిక్ చేసి ఇటీవలే విధుల్లో చేరినట్టుగా తెలుస్తోంది. అయితే CPO ఆఫీసులో కీలక బాధ్యతల్లో ఉన్న ఉద్యోగి అండదండలతో పోలీసు యంత్రాంగం బిల్లులు నీలం రామ్మోహన్ తయారు చేసేవాడని పోలీసుల విచారణలో తేలింది. నీలం రామ్మోహన్ ను అటాచ్డ్ తొలగించిన తరువాత ఆ స్థానంలో విధుల్లో చేరిన ఉద్యోగికి బిల్లులు తయారు చేయవద్దని వారించి మరీ హెడ్ కానిస్టేబుల్ సేవల్లో తరించినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే రామ్మోహన్ స్థానంలో డ్యూటీలో చేరిన ఉద్యోగి వేతనాల డ్రా చేయించేప్పుడు లెక్కలు తీయగా ఎక్కువగా వస్తున్నాయని గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో CPO ఆఫీసులో సాగుతున్న గుట్టంతా బట్ట బయలు అయినట్గుగా సమాచారం.
CP చొరవ…
CPO ఆఫీసులో వేతనాల పేరిట గోల్ మాల్ జరిగిందన్న విషయం దృష్టికి రాగానే సీపీ గౌష్ ఆలం ప్రత్యేక దృష్టి సారించారు. చనిపోయిన వారి పేరిట వేతనాలు డ్రా చేసుకుంటున్నారన్న విషయంపై ఆరా తీశారు. విభాగాల వారిగా సిబ్బంది వేతనాల వివరాలన్నింటిని సేకరించడంతో అసలు విషయం బయటపడింది. ఆ తరువాత విచారణ జరిపి బాధ్యులను గుర్తించాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
అప్పుడే…
2018కి ముందు మ్యానువల్ విధానం ద్వారా వేతనాలు ఇచ్చే పద్దతి కొనసాగేది. ఆ తరువాత ఆన్ లైన్ లో ఐడీ నంబర్లు వేసి వేతనాలు అందించడం ప్రారంబించారు. అయితే ఇందులో కేవలం డ్యూటీ చేస్తున్న వారి వివరాలను మాత్రమే అప్ లోడ్ చేస్తారు. ఇందులో చనిపోయిన వారి వివరాలు అప్ లోడ్ చేసే అవకాశం లేదన్న విషయాన్ని గమనించే ముగ్గురు కానిస్టేబుళ్ల పేరిట వేతనాలు డ్రా చేసేందుకు స్కెచ్ వేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఇందుకు డీపీఓ స్టాఫ్ లో కొంతమంది తమ వంతు సహకారం అందించి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ట్రెజరీ ఎలా..?
అయితే ప్రభుత్వ యంత్రాంగం వేతనాలకు సంబంధించిన డబ్బులు డ్రా చేయాలంటే సబ్ ట్రెజరీ కార్యాలయాల ఆమోదం కంపల్సరీ. హెడ్ ఆఫ్ అకౌంట్ నంబర్ల ఆధారంగా ఆయా శాఖల్లో పని చేసే వారికి వేతనాలు ఇచ్చేందుకు ఆమోద ముద్ర పడగానే వారి అకౌంట్లలో నగదు జమ అవుతుంటుంది. అయితే కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో చనిపోయిన ముగ్గురు కానిస్టేబుళ్ల వేతనాలు యాడ్ చేసిన తరువాత సాధారనంగా అలాట్ అయిన అమౌంట్ కంటే ఎక్కువగా డబ్బులు డ్రా అవుతున్నాయన్న విషయాన్ని ట్రెజరీ అధికారులు గుర్తించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. ట్రెజరీ విభాగంలో పని చేస్తున్న అధికార యంత్రాంగం ప్రతి బిల్లును కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే డబ్బులు డ్రా చేసుకునేందుకు ఆమోదించాల్సి ఉంటుంది. కానీ కరీంనగర్ కమిషనరేట్ సిబ్బంది పంపిన బిల్లులకు యథావిధిగా అప్రూవల్ ఎలా చేశారోన్న ప్రశ్న తలెత్తుతోంది. కరీంనగర్ CPO స్టాప్ తో పాటు ట్రెజరీ కార్యాలయాల్లో పనిచేస్తున్న వారూ చేతులు కలిపారా అన్న విషయంపై కూడా ఆరా తీయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

