నిను వీడని నీడను నేనే… తెరపైకి విజిలెన్స్ రిపోర్ట్…

కరీంనగర్ గ్రానైట్ అక్రమాల తీరు…

సీఐడీ విచారణకు సీఎం ఆదేశం…

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ గ్రానైట్ రవాణాలో జరిగిన అక్రమాల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. అసెంబ్లీలో రాఘవ కన్సట్రక్షన్స్ పై బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేయడంపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఐడీ విచారణకు ఆదేశించారు. రాష్ట్రంలోని గ్రానైట్ అక్రమాలకు సంబంధించిన తీరుపై విచారణ చేయిస్తామని ప్రకటించడం సంచలనంగా మారింది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రానైట్ క్వారీల నుండి బ్లాకులు వివిధ పోర్టుల నుండి చైనాకు ఎగుమతి అవుతున్నాయి. అయితే విదేశాలకు తరలిస్తున్న బ్లాకులకు సంబంధించిన సీనరేజ్ ట్యాక్స్ ఎగవేస్తున్నారని విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు నివేదిక ఇచ్చారు. ఏపీలోని పోర్టులకు చేరిన బ్లాకులను తనిఖీ చేసి ఇందుకు సంబంధించిన నివేదికలను విజిలెన్స్ తయారు చేసింది. మొత్తం 198 గ్రానైట్ క్వారీలకు సంబంధించిన బ్లాకులను ఎనిమిది ట్రాన్స్ పోర్టు ఏజెన్సీలు రవాణా చేశాయని నివేదికలో పేర్కొంది. C.NO.258/NRI/2013 ఉన్న నివేదిక ప్రకారం రూ. 124,94,46,147 చెల్లించకుండా గ్రానైట్ బ్లాకులు తరలించారని నివేదికలో వివరించింది. మైనింగ్ యాక్ట్ 26(3)(i)&(ii) of APMMC Rules 1966 ప్రకారం సీనరేజ్ ఎగవేసిన విలువకు ఐదు రెట్ల మేర పెనాల్టీ వసూలు చేయాలని కూడా విజిలెన్స్ అధికారులు ఆ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. అప్రైజల్ రిపోర్ట్ ప్రకారం పెనాల్టీ వసూలు చేయాల్సి ఉన్నప్పటికీ చట్ట సవరణ చేయాల్సిన అంశాన్ని విస్మరించి అప్పటి ప్రబుత్వం మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. తాము రూ. 749,66,76,882 చెల్లించే పరిస్థితిలో లేమని పెనాల్టీని తగ్గించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి వినతి చేశారు సదరు గ్రానైట్ క్వారీల నిర్వాహాకులు. ఇందుకు సమ్మతిస్తూ అప్పటి ప్రభుత్వం వన్ ప్లస్ వన్ పెనాల్టీ చెల్లించేందుకు అనుమతి ఇస్తూ ఓ మెమోను విడుదల చేసింది. ఆ తరువాత కొంత డబ్బు చెల్లించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో మేరకు కూడా డబ్బులు మైనింగ్ విభాగానికి అందనట్టుగా తెలుస్తోంది.

ఈడీ ఎంక్వైరీ…

ఇకపోతే కరీంనగర్ గ్రానైట్ అక్రమాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ కూడా ఎంట్రీ ఇచ్చింది. కరీంనగర్ లో సోదాలు చేపట్టిన ఈడీ అధికారుల బృందం విజిలెన్స్ అప్రైజల్ రిపోర్ట్ ఆధారంగా గ్రానైట్ క్వారీలు, కొంతమంది యజమానుల ఇండ్లలో సోదాలు చేపట్టింది. ఆ తరువాత ఓ ప్రెస్ నోట్ కూడా విడుదల చేసిన ఈడీ పనమా వికిలీక్స్ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిగాయని, చైనా కంపెనీల ద్వారా జరిగిన ఈ ఆర్థిక లావాదేవీల్లో హవాల కూడా జరిగిందని కూడా వెల్లడించింది. కొంత నగదు కూడా సీజ్ చేశామని ప్రకటించిన ఈడీ అధికారులు ఆ తరువాత ఈ కేసును పెండింగులో ఉంచారు. దాదాపు నాలుగేళ్ల క్రితం జరిగిన ఈ విచారణ కూడా మరుగునపడిపోవడంతో కరీంనగర్ గ్రానైట్ స్కాం సద్దుమణిగి పోయిందనుకున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీ విచారణకు ఆదేశించడంతో గ్రానైట్ అక్రమాల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చినట్టయింది. ఏది ఏమైనా కరీంనగర్ గ్రానైట్ అక్రమాలకు సంబంధించిన ఫైల్ క్లోజ్ అయిపోయిందన్న ప్రచారం అంతా తప్పేనని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో స్పష్టం అయింది. ఈ వ్యవహారంపై ఈడీ విచారణ జరుపుతోందని అసెంబ్లీలో ప్రకటించగా, రాష్ట్ర ప్రభుత్వం కూడా CBCID విచారణ చేపడ్తుందని ప్రకటించారు.

‘‘బండి’’ ట్విట్

గ్రానైట్ అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నట్టుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ట్విట్ చేశారు. అయితే గ్రానైట్ ఏజెన్సీలను బ్లాక్ మెయిల్ చేసిన వారు ఎవరో కూడా వెలుగులోకి తీసుక రావల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వం సంస్కృతినే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేసేలా నడుచుకుంటున్నారని ఆరోపించారు. గ్రానైట్ అక్రమాల వ్యవహారం బట్టబయలు అయ్యేందుకు బాధ్యతయుతమైన అధికారులను నియమించి గడువు విధించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.