రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ వైవిద్యం…
దిశ దశ, వరంగల్:
నక్సల్స్ ఏరివేతలో టార్గెట్ అయిన ఆ పోలీస్ ఆఫీసర్ ఐపీఎస్ అధికారిగా సేవలందించారు. నక్సల్స్ ఏరివేతలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఆయనకు ప్రభుత్వం యాగ్జిలర్ ప్రమోషన్ కల్పించింది. తాజాగా చట్ట సభకు ఎన్నికైన ఆయన తనలోని కళను ప్రదర్శించేందుకు ప్రజా యుద్ద నౌక గద్దర్ వేషం కట్టారు. అప్పుడు ఎర్రజెండా ఎత్తిన వారిని ఏరి పారేసిన ఆ అధికారే ఇప్పుడు ఎర్ర జెండా ఎత్తి మరీ పొడుస్తున్నపొద్దు పాటకు నాట్యం చేయడం విశేషం.

ఎస్సైగా ప్రస్తానం..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1989లో ఎస్సైగా పోలీసు విభాగంలో చేరిన కేఆర్ నాగరాజు నక్సల్స్ ఏరివేత ఆపరేషన్లలో కీలకంగా వ్యవహరించారు. ఆ సమయంలో పీపుల్స్ వార్ నక్సల్స్ కు వ్యతిరేకంగా పని చేసిన అతి కొద్ది పోలీసు అధికారుల్లో కేఆర్ నాగరాజు ఒకరు. ఎదురు కాల్పులు ఘటన జరిగిందనగానే ఆ ఆపరేషన్ లో నాగరాజు భాగస్వామ్యం ఉంటుందన్న చర్చ వరంగల్ జిల్లా వ్యాప్తంగా జరిగేది. రాష్ట్రంలోని కొంతమంది పోలీసు అధికారులు కూడా ఆయన గురించి మాట్లాడుకునే పరిస్థితి ఉండేది. నక్సల్స్ అణిచివేతలో పని చేసిన నాగరాజు యాగ్జిలర్ ప్రమోషన్లు పొంది ఐపీఎస్ అధికారి స్థాయికి చేరారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఎస్సై నుండి అడిషనల్ ఎస్పీగా పని చేసి ఐపీఎస్ కనఫర్మ్ కాగానే నిజామాబాద్ సీపీగా బాధ్యతలు నిర్వర్తించి రిటైర్ అయ్యారు. ఆ తరువాత ఆయన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వర్దన్నపేట ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి గెలిచారు.
ఎమ్మెల్యేగా…
పొడుస్తున్న పొద్దు మీద పోరు తెలంగాణమా… కోట్లాది ప్రాణమా… అన్న పాటకు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ కేఆర్ నాగరాజు గద్దర్ వేషధారణలో నాట్యం చేయడం గమనార్హం. పీపుల్స్ వార్ తో అనుబంధం పెనవేసుకున్న గద్దర్ జననాట్యమండలి ద్వారా తన గళాన్ని వినిపించే వారు. శ్రమ జీవుల హక్కుల కోసం, నక్సల్స్ కు అనుకూలమైన విధంగా పాటలు పాడేవారు. ప్రజా యుద్ద నౌకగా పేరుగాంచిన గద్దర్ పేరు చెప్పగానే అన్నల పాటలు, వారి విప్లవ పోరాటం గురించి ప్రతి ఒక్కరి మదిలో మెదులుతుంది. నక్సల్స్ కు వ్యతిరేకంగా పని చేసిన కేఆర్ నాగరాజు ఎమ్మెల్యేగా గద్దర్ వేషంలో గజ్జె కట్టడం గమనార్హం. సైద్దాంతిక వైరుద్యంతో వ్యవహరించిన పోలీసు అధికారిగా జీవించిన కేఆర్ నాగరాజు, రాజకీయాల్లోకి వచ్చిన తరువాత గద్దర్ వేషధారణతో అందరినీ ఆకట్టుకోవడం ఆయనలోని మరో కోణాన్ని ఆవిష్కరించినట్టయింది. వరంగల్ వేదికగా నక్సల్స్ టార్గెట్లను హత మార్చగా ఇందుకు బాధ్యుడిని చేస్తూ గ్రీన్ టైగర్స్ పేరిట గద్దర్ పై కాల్పులు జరిగాయి కూడా. భావ వైరుద్యం ఉన్నప్పటికీ రిటైర్డ్ పోలీస్ అధికారి గద్దర్ వేషం వేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. తెలంగాణ ఎమ్మెల్యేల క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో వర్దన్నపేట ఎమ్మెల్యే నాగరాజు గద్దర్ లా ఆడిపాడి సభికులను ఆకట్టుకున్నారు.

