దిశ దశ, భూపాలపల్లి:
గమ్యస్థానానికి చేర్చుతాడన్న నమ్మకంతో ఆటోలో ప్రయాణించిన పాపానికి ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డడో ఆటో డ్రైవర్. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. సదరు నిందితునికి 5 ఏళ్ల కఠిన జైలు శిక్ష, రూ. 1000 జరిమానా విధిస్తూ భూపాలపల్లి అసిస్టెంట్ సెషన్స్ న్యాయస్థానం తీర్పునిచ్చింది. సంఘటనా వివరాల్లోకి వెల్తే… 2020 సెప్టెంబర్ 26 సాయంత్రం మహాముత్తారం మండలానికి చెందిన ఓ మహిళ కాటారంలోని ఓ హస్పిటల్ లో శిక్షణ కోసం వచ్చారు. తిరిగి తన స్వగ్రామానికి వెల్లేందుకు ఆటో స్టాండ్ లో ఉన్న టాటా మ్యాజిక్ నంబర్ AP36TV1405లో ఎక్కారు. భూపాలపల్లి జిల్లా దూదేకులపల్లికి చెందిన ఆటో డ్రైవర్ వినోద్ అలియాస్ వినయ్ కుమార్ ఆమెను గమ్య స్థానానికి కాకుండా కాటారం శివార్లలోని కొత్తపల్లి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లిన తరువాత ఆమెపై అత్యాచారం చేయగా వినోద్ చర్యలను ప్రతిఘటించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బాధితురాలిని చంపుతానని బెదిరించి అత్యాచారం చేసిన వినోద్ మరునాటి ఉదయం ఆమెను కాటారం సెంటర్ లో వదిలేసి పరార్ అయ్యాడు. బాధితురాలు కాటారం పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై సాంబమూర్తి కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో చార్ఝ్ షీట్ కూడా దాఖలు చేశారు. కోర్టులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎండీ రఫీ వాదనలు వినిపించగా, ఏఎస్ఐ వెంకన్న, కానిస్టేబుళ్ల ఎం సంపత్ రెడ్డి కేసుకు సంబంధించిన సాక్షాధారాలను ప్రవేశపెట్టారు. ఈ కేసులో వాదప్రతివాదనలు విన్న అసిస్టెంట్ సెషన్స్ న్యాయస్థానం వినోద్ అలియాస్ వినయ్ కుమార్ కు 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 1000 జరిమానా విధించారు. కేసును దర్యాప్తు చేయడంతో పాటు కోర్టులో సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టిన పోలీసు అధికార యంత్రాంగాన్ని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అభినందించారు.

