చిన్నారులను ఠాణాలోనే వదిలేసి… ఖాకీలకు షాకిచ్చిన ఆలుమగలు…

దిశ దశ, మానకొండూరు:

భార్య భర్తల మధ్య నెలకొన్న విబేధాలకు పుట్ స్టాప్ పెట్టి దాంపత్య జీవనం సాగించేందుకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు షాకిచ్చారు దంపతులు. తమ మధ్య నెలకొన్న అంతరాన్ని తగ్గించుకునేందుకు చొరవ చూపని వారిద్దరు రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఫ్యామిలీని కలిపేందుకు చొరవ తీసుకున్న పోలీసులపైనే భారం మోపి అక్కడి నుండి వెళ్లిపోయారు.

ప్రేమ వివాహం…

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూరుకు చెందిన రవి కుమార్, లలితలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి దాంపత్య జీవనానికి ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చారు. అయితే కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య అభిప్రాయబేధాలు పొడసూపడంతో పోలీసులను ఆశ్రయించారు. స్థానిక లోయర్ మానేరు డ్యాం (LMD) పోలీసులు ఇద్దరు బిడ్డలు ఉన్న ఆ దంపతుల మధ్య వచ్చిన తగవులకు స్వస్తి పలికించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం కౌన్సెలింగ్ నిర్వహించినప్పటికీ భార్యాభర్యలు మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరించారు. చివరకు లలిత తన బిడ్డలిద్దరితో పాటు మెడలోని పుస్తెల తాడును పోలీస్ స్టేషన్ లో అప్పగించి అక్కడి నుండి వెళ్లిపోయింది. చిన్నారులిద్దరని వదిలేసి వెళ్లడమే కాకుండా పుస్తెల తాడు కూడా టేబుల్ పై పెట్టి వెళ్లడం అక్కడున్న వారిని షాక్ కు గురి చేసింది. ఆ తరువాత రవి కుమార్ కూడా పిల్లలను అక్కడే వదిలేసి స్టేషన్ నుండి వెళ్లిపోయారు. దీంతో చిన్నారులిద్దరూ పోలీస్ స్టేషన్ లో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తీరు స్థానికులను సైతం కంటతడి పెట్టించింది. పోలీస్ స్టేషన్ లో ఉన్న మహిళా కానిస్టేబుళ్లు పిల్లలను బుజ్జగించే ప్రయత్నం చేశారు. పసి హృదయాలపై కనికరం లేకుండా తల్లిదండ్రులిద్దరూ వారిని వదిలేసి వెళ్లిపోవడం అక్కడున్న వారిని కలిచివేసింది. కన్నీరు మున్నీరుగా విలపించిన ఆ బిడ్డలను చూసి ఓదార్చే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. చివరకు రవి కుమార్ తల్లిని స్టేషన్ కు రప్పించి చిన్నారుల అలనా పాలనా చూసుకోవాలని సూచించి అప్పగించారు.