అటు నేషనల్… ఇటు స్టేట్… గ్రానైట్ అక్రమాలపై దర్యాప్తు…

దిశ దశ, కరీంనగర్:

అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతి అయి కరీంనగర్ కే వన్నె తెచ్చిన గ్రానైట్ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతుండడం సంచలనంగా మారింది. గ్రానైట్ అక్రమ రవాణాపై ఇప్పటికే ఈడీ, సీబీఐ ఎంట్రీ ఇవ్వగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మరో దర్యాప్తు సంస్థ జోక్యం చేసుకోనుంది. దీంతో అటు జాతీయ, ఇటు రాష్ట్ర దర్యాప్తు సంస్థలు గ్రానైట్ తవ్వకాలపై సమగ్రంగా విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నాడు…

కరీంనగర్ గ్రానైట్ క్వారీల నుండి చైనాకు ఎగుమతి అవుతున్న వ్యవహారంపై విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దృష్టి సారించారు. కృష్ణపట్నం, విశాఖపట్నం తదితర ఓడ రేవుల నుండి సీనరేజ్ ట్యాక్స్ చెల్లించకుండా ఎగుమతి చేస్తున్నారని గుర్తించారు. ఆయా పోర్టులలో చైనాకు ఎగమతి చేసేందుకు సిద్దంగా ఉన్న గ్రానైట్ బ్లాకులను సమగ్రంగా పరిశీలించిన విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు సీనరేజ్ ట్యాక్స్ ఎగవేస్తున్నట్టుగా గుర్తించారు. ఇందుకు సంబంధించి 29-05-2013న అప్రైజల్ రిపోర్ట్ (C.NO. నెం.60 NO.268/NR1/2013) ఇచ్చారు. ఈ నివేదిక ఆధారంగా 768889.937 క్యూబిక్ మీటర్ల గ్రానైట్ విదేశాలకు ఎగుమతి అయిందని, రూ.124,94,46,147 సీనరేజ్ చెల్లించాల్సి ఉందని గుర్తించారు. మైనింగ్ యాక్ట్ ప్రకారం వన్ ప్లస్ ఫై టైం పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని ఇందుకు రూ. 749,66,76,882 కోట్లు బాధ్యులైన వారి నుండి వసూలు చేయాలని ఆ రిపోర్టులో పేర్కొన్నారు. 8 రవాణా ఏజెన్సీల ద్వారా కరీంనగర్ సమీపంలోని వివిధ క్వారీల నుండి గ్రానైట్ బ్లాకులు తరలించారని విజిలెన్స్ అధికారులు ఆ నివేదికలో వివరించారు. అయితే విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం పెనాల్టీలో మినహాయింపు ఇవ్వాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి వినతి చేశారు. ఈ మేరకు 6665/R1/2016 మెమో విడుదల చేసిన ప్రభుత్వం వన్ ప్లస్ వన్ పెనాల్టీ కట్టాలని సూచించింది. అయితే ఈ మెమో నిబంధనలకు విరుద్దంగా పేర్కొనబడిందని మైనింగ్ చట్టాలను సవరలించాల్సి ఉంటుందని తెలుస్తోంది. కరీంనగర్ గ్రానైట్ అక్రమాలపై ప్రస్తుత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పలువురు కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేశారు. మరో వైపున ప్రధాన మంత్రి కార్యాలయానికి, ED, CBI, DGGI విభాగాలకు కరీంనగర్ కు చెందిన అడ్వకేట్ భేతి మహేందర్ రెడ్డి, సింగిరెడ్డి భాస్కర్ రెడ్డిలు ఫిర్యాదులు చేశారు. ED కరీంనగర్ లోని పలు చోట్ల సోదాలు నిర్వహించి కొంత నగదును స్వాధీనం చేసుకున్నామని, బినామీ అకౌంట్లకు డబ్బులు వచ్చినట్టుగా గుర్తించామని, పనమా లీక్స్ లో పేరున్న లీ వెన్‌హువోకు చెందిన సంస్థల ద్వారా ఎలాంటి డాక్యూమెంట్లు లేకుండానే అప్పు తీసుకున్నట్టుగా గుర్తించామని ఈడీ అధికారులు ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఆ తరుత ఈడీ అధికారులు ఈ విషయంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మరోసారి ఫిర్యాదులు చేశారు. అలాగే విశాఖపట్నం సీబీఐ కార్యాలయం నుండి కూడా మరో లేఖ విడుదలైందని కరీంనగర్ గ్రానైట్ అక్రమాలపై విచారణ చేస్తున్నట్టుగా పేర్కొన్నారని అడ్వకేట్ భేతి మహేందర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి, వివిధ సంస్థలకు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించారు. ఈ విషయంపై సమగ్రంగా విచారణ చేయాలని కూడా కోరారు. అలాగే ED అధికారుల ప్రెస్ నోట్ తరువాత ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూడా ప్రధానమంత్రి కార్యాలయానికి, DOPT విభాగానికి కూడా ఫిర్యాదు చేశారు. 2013 వరకు జరిగిన గ్రానైట్ ఎగుమతులపై జాతీయ దర్యాప్తు సంస్థలు నేడో రేపో దర్యాప్తు ఇంకా పెండింగులోనే ఉండడంతో నేడో రేపో ఆయా సంస్థలు రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.

సీబీసీఐడీ…

ఇకపోతే రాష్ట్రంలో మైనింగ్ అక్రమాలపై అసెంబ్లీలో చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత పదేళ్లలో రాష్ట్రంలో జరిగిన మైనింగ్ అక్రమాలపై విచారణ చేయిస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సభలో ప్రకటించారు. ఈ మేరకు ఇటీవల జరిగిన క్యాబినెట్ మీటింగులో మైనింగ్ అక్రమాలపై విచారణ చేపట్టే బాధ్యతలను సీబీసీఐడీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే సీబీసీఐడీ కూడా గ్రానైట్ అక్రమ తవ్వకాలు, ఎగుమతులపై సమగ్ర విచారణ చేసే అవకాశాలు ఉన్నాయి. మైనింగ్ విభాగం నుండి ఎంత విస్తీర్ణంలో అనుమతులు తీసుకున్నారు, ఎంత మేర తవ్వకాలు జరిపారు, వెలికి తీసిన గ్రానైట్ పరిమాణం ఎంత, రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించిన సీనరేజ్ ఎంత, జీఎస్టీ తదితర అన్ని అంశాలపై CBCID అధికారులు లోతుగా దర్యాప్తు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. గతంలో విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదికలను కూడా పరిశీలించి పర్యావరణ చట్టాలను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయతే రాష్ట్ర ప్రభుత్వం ఏయే అంశాలపై విచారణ చేయాలన్న ఆదేశాలకు అనుగుణంగా సీబీసీఐడీ అధికారులు దర్యాప్తు చేయనున్నారు. విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా జాతీయ దర్యాప్తు సంస్థలు, గత పదేళ్లలో జరిగిన మైనింగ్ అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని సీబీసీఐడీ రంగంలోకి దిగుతుండడం గమనార్హం.