దిశ దశ, చొప్పదండి:
నిరుపేద దళిత కుటుంబానికి చెందిన ఓ జర్నలిస్ట్ హఠాన్మరణం ఆ కుటుంబాన్ని దిక్కు లేని వారిని చేసింది. కార్డియాక్ అరెస్ట్ తో అకాల మరణం చెందిన ఆ జర్నలిస్టు కుటుంబాన్ని ఆదుకునేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
చొప్పదండి…
చొప్పదండి కేంద్రం నుండి జర్నలిస్టుగా జీవనం సాగిస్తున్న సంబోజి శేఖర్ ఇటీవల హఠన్మారణం చెందాడు. ఆయన అన్న సంబోజి విజయ్ కుమార్ పాతికేళ్ల క్రితం మరణించిన తరువాత కుటుంబ బాధ్యతలను మోస్తున్న శేఖర్ చనిపోవడంతో ఆ కుటుంబాన్ని ఆదుకునే వారు లేకుండా పోయారు. వృద్దాప్యానికి చేరుకున్న తల్లిదండ్రులు అనారోగ్యంతో బాధపడుతుండగా శేఖర్ పిల్లలు కూడా చిన్నారులే కావడం బాధాకరం. ఆయన కుటుంబానికి బాసటగా నిలవాలని నిర్ణయించిన స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఈ మేరకు పార్టీ శ్రేణులను దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యే పిలుపును అందుకున్న స్థానిక కాంగ్రెస్ నాయకులు కూడా సానుకూలంగా స్పందించారు. చొప్పదండి కాంగ్రెస్ నాయకులంతా కలిసి రూ. 3.50 లక్షల వరకూ సమకూర్చి సంబోజి శేఖర్ కుటుంబానికి బాసటగా నిలిచారు. శేఖర్ భార్యకు ఔట్ సోర్సింగ్ ద్వారా ఉపాధి కల్పించేందుకు కూడా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొరవ తీసుకుంటున్నారు. ప్రెస్ అకాడమీ ద్వారా అందే ఆర్థిక సాయం విషయంలో చొరవ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాను కోరారు ఎమ్మెల్యే.

అరుదు…
కలాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న జర్నలిస్టులు మరణించిన తరువాత వారి కుటుంబాల అలనాపాలనా చూసుకునేవారు లేకుండా పోతున్నారు. ప్రభుత్వం ప్రెస్ అకాడమీ ద్వారా ఇచ్చే ఒకటి, రెండు లక్షల సాయం కోసం వారి కుటుంబాలు కార్యాలయాల్లో తిరగాల్సిన దుస్థితి ఉంటుంది. అయితే ఆయా పార్టీల నాయకులు, అధికార యంత్రాంగం కూడా చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలను అక్కున చేర్చుకునే పరిస్థితి అంతంత మాత్రమే. రాష్ట్రంలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు భారీ ఆర్థిక సాయం చేశారు తప్ప వారి కుటుంబాలను అక్కున చేర్చుకున్న సందర్భాలు అంతంతే. అయితే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాత్రం సంబోజి శేఖర్ కుటుంబానికి ఆర్థిక సాయం అందించడంతో పాటు ఆయన భార్యకు ఉపాధి కల్పించేందుకు చొరవ తీసుకోవడం ఆదర్శంగా నిలిచింది.

