అరణ్యం నుండి జనారణ్యం వైపునకు… కేంద్ర కమిటీ సభ్యుడు నరహరి ప్రస్తానం…

దిశ దశ, హైదరాబాద్:

మావోయిస్టు పార్టీలో మిగిలిన వారందరిని జనజీవనంలోకి రప్పించేందుకు పోలీసులు ఇంకా ఆపరేషన్ కొనసాగిస్తూనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియర్ నాయకులు కొంతమంది పార్టీలోనే కొనసాగుతున్న నేపథ్యంలో వారిని బాహ్య ప్రపంచంలోకి రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా కేంద్ర కమిటీ సభ్యుడు, బీహార్-జార్ఖండ్ ప్రత్యేక ప్రాంతీయ కమిటీ (BJSAC) కార్యదర్శిగా పని చేస్తున్న పసునూరి నరహరి @ విశ్వనాథ్ @ సలై దా, ఆయన సతీమణి రాష్ట్ర కమిటీ సభ్యురాలు (SCM) మేదర దానమ్మ @ లత @ పూనమ్ @ జోబాలు జనజీవనంలోకి వచ్చారు. మంగళవారం తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ సమక్షంలో వీరిద్దరు మావోయిస్టు పార్టీని వీడి బాహ్య ప్రపంచలోకి వస్తున్నట్టుగా ప్రకటించారు. వీరిద్దరి లొంగుబాటుతో మావోయిస్టు పార్టీలో తెలంగాణాకు చెందిన వారు ఇంకా ముగ్గురు మాత్రమే పార్టీలో కొనసాగుతున్నారు. కేంద్ర కమిటీ సభ్యుడు ముప్పాళ లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి, స్టేట్ కమిటీ మెంబర్లు జాడె రత్నాబాయి అలియాస్ సుజాత, వార్త శేఖర్ అలియాస్ మంగ్తులు మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారని పోలీసులు ప్రకటించారు. వీరు కూడా బయటకు వచ్చినట్టయితే విప్లవ పార్టీతో తెలంగాణాకు చెందిన వారంతా తెగతెంపులు చేసుకున్నట్టు అవుతుందని అంటున్నారు.

హైదరాబాద్ సీఓగా…

హన్మకొండ జిల్లా ఖాజీపేట మండలం సోమిడికి చెందిన పసునూరి నరహరి @ విశ్వనాథ్ @ సలై దా వరంగల్ LB కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా ఆర్ఎస్యూ (RSU)తో అనుబంధం కారణంగా అడవి బాట పట్టారు. 1982 లో అప్పటి CPI (ML) Peoples war ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కార్యదర్శి పులి అంజయ్య ప్రేరణతో అజ్ఞాతంలోకి వెళ్లారు. 1985 వరకు కుంట దళ సభ్యునిగా పని చేసినప్పుడు తాలిపేరు నది వద్ద పడిపోగా కాలు విరిగింది. హైదరాబాద్ లో చికిత్స చేయించుకున్న ఆయన నేరుగా బూర్గుంపాడ్ ప్రాంతానికి చేరుకున్నారు. 1986లో గోదావరి నది పరివాహక ప్రాంతమైన బూర్గంపాడు ఏరియాలో 1+2′ టీమ్ కమాండర్ గా పని చేశాడు. బూర్గంపాడ్ సమీపంలో జరిగిన ఎదురు కాల్పుల ఘటన జరిగింది. ఇదే సమయంలో హైదరాబాద్ సిటీ ఆర్గనైజర్ గా (CO)గా పని చేసిన నరహరి కొంతకాలం దండకారణ్య ప్రాంతంలోని రామన్న దళంలో పని చేశారు. 1988లో గుంటూరు జిల్లా దాచెపల్లి మండలం గామలపాడుకు చెందిన మేదర దానమ్మ @ లత @ పూనమ్ @ జోబాను వివాహం చేసుకున్నాడు. 1998 నుండి 90 వరకు బెంగుళూరు నగరంలో పీపుల్స్ వార్ నేత పులి అంజయ్య డెన్ కీపర్ గా పని చేశారు. 1990 నుండి 1997 వరకు సరఫరా బృందం (Supply Team), ఆయుధాల బృందంలో (Arms Team)లలో పని చేశారు. 1997 నుండి 1999 వరకు దండకారణ్య ప్రాంతంలోని దక్షిణ బస్తర్ సాంకేతిక విభాగం బృందంలో (Technical Department Team )లో పని చేశారు. 2000 సంవత్సరంలో ప్రాంతీయ కమిఠీ సభ్యుడు (RCM) బాధ్యతలు చేపట్టిన నరహరి 2004 వరకు మహారాష్ట్రలోని నాగపూర్ లో సాంకేతిక విభాగం బృందం, కేంద్ర సాంకేతిక కమిటీ (CTC)లకు ఇంఛార్జిగా బాధ్యతుల నిర్వర్తించారు. 2005లో ఝార్ఖండ్ కు బదిలీ అయిన ఆయన బీహార్, ఝార్ఖండ్ ప్రత్యేక ప్రాంతీ కమిటీ (BJSAC)లో SAC” సభ్యుడిగా 2010 వరకు కొనసాగారు. ఇదే సమయంలో BJSAC ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యులతో కొత్తగా ఏర్పాటు చేసిన సాంకేతిక విభాగ బృందం (Technical Department team) ఇంఛార్జీగా 2014 వరకు పని చేశారు. 2014లో బీహార్ రాష్ట్ర కమిటీ గయా జిల్లా సంస్థగత వ్యవహారాల ఇంఛార్జిగా, 2017లో తూర్పు ప్రాంతీయ బ్యూరో (ERB)లో జరిగిన కేంద్ర కమిటీ ప్రత్యేక సమావేశం (CC)లో నరహరికి కేంద్ర కమిటీ సభ్యునిగా CCMగా బాధ్యతలు అప్పగించింది నాయకత్వం. 2017లో బీహార్ నుండి ‘బీహార్-జార్ఖండ్ ప్రత్యేక ప్రాంతీయ కమిటీ’ (BJSAC)లో పని చేస్తున్న ఆయన సాంకేతిక విభాగం ఇంఛార్జిగా వ్యవహరించారు. 2018 నుండి 2020 వరకు జార్ఖండ్ లోని కొల్డాన్ ఏరియాలో పని చేయడంతో పాటు రాష్ట్ర సైనిక కమిషన్ ఇంఛార్జిగా, BJSAC సచివాలయ సభ్యుడిగా వ్యవహరించారు. 2022 నుండి 2025 వరకు సాంకేతిక విభాగానికి, బీహార్-జార్ఖండ్ ప్రత్యేక ప్రాంతీయ కమిటీ (BJSAC)కి ఇంఛార్జిగా పని చేశారు. 2026లో ‘బీహార్-జార్ఖండ్ ప్రత్యేక ప్రాంతీయ కమిటీ’ (BJSAC)కి కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఆయుధాలు, మోర్టార్ రాకెట్లు, బూబీ ట్రాప్స్ (booby traps), రాకెట్ ప్రేరేపిత గ్రేనేడ్లు తయారు చేయడంలో నిపుణడైన నరహరి పార్టీ శ్రేణులకు కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. ఆయన భార్య మేదర దానమ్మ @ లత @ జోబా 1986 నుండి 1988 వరకు ఏపీలోని గుంటూరు జిల్లా దాచెపల్లి ఏరియాలో ఆర్గనైజర్ గా పని చేసిన ఆమె 1988లో పసునూరి నరహరితో కలిసి బెంగుళూరులో పులి అంజయ్య డెన్ కీపర్ గా పని చేసేందుకు వెళ్లారు. 1992లో యూనిట్ ఇంఛార్జిగా, 1997లో దండకారణ్యంలోని దక్షిణ బస్తర్ సాంకేతిక విభాగంలో పని చేశారు. 2000లో జిల్లా కమిటీ సభ్యురాలిగా (DCM)గా పని చేసిన ఆమె కొంతకాలం నాగపూర్ సాంకేతిక విభాగంలో పని చేశారు. 2004లో నాగపూర్ లో అరెస్ట్ అయిన దానమ్మ 2011లో బెయిలుపై బయటకు వచ్చి తిరిగి పార్టీలో చేరారు. 2011 నుండి 12 వరకు బీహార్, ఝార్ఖండ్ ప్రత్యేక ప్రాంతీయ కమిటీలో DVC మెంబర్ గా, 2013లో సాంకేతిక విభాగంలో DCSగా, 2018లో స్టేట్ కమిటీ మెంబర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. 2018 నుండి 2023 వరకు జార్ఖండ్ లోని కొలహన్ ప్రాంతంలో సంస్థాగత, సాంకేతిక విభాగంలో బాధ్యతలను నిర్వహించారు. 2023 నుండి 2026 వరకు బీహార్-జార్ఖండ్ ప్రత్యేక ప్రాంతీయ కమిటీ (BJSAC) సాంకేతిక విభాగంలో పనిచేశారు.