మల్లారెడ్డిపల్లిలో రెండో రోజూ యథాస్థితి… లారీలను అడ్డుకున్న స్థానికుడు…

దిశ దశ, వీణవంక:

వీణవంక మండలం రెడ్డిపల్లిలో రెండో రోజు కూడా ఇసుక క్వారీల్లో లోడింగ్ నిలిచిపోయింది. బ్లాక్ 2 రీచ్  నిర్వాహకులు వేసిన రోడ్డుపై బ్లాక్ 1కు సంబంధించిన లారీలు నడవవద్దన్న కారణంతో రోడ్డును క్లోజ్ చేశారు. దీంతో శనివారం నుండి ఇసుక లోడింగ్ ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి. రెండో రోజు కూడా మల్లారెడ్డిపల్లికి చేరుకున్న లారీలను స్థానికుడు అడ్డుకున్నాడు. దీంతో స్థానిక పోలీస్ కానిస్టేబుల్ అక్కడకు చేరుకుని అడ్డుకున్న వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీలను అడ్డుకుంటే కేసులు పెడ్తామని హెచ్చరించారు. అయితే తమ గ్రామానికి వచ్చిన లారీలు ఎక్కడిక్కడ నిలిపివేస్తుండడంతో ఇబ్బందిగా మారిందని మల్లారెడ్డిపల్లి వాసి అంటున్నారు. రోడ్లు కూడా ధ్వంసం అయిపోతున్నాయని, పంట పొలాలకు వెళ్లాలన్నా ఇబ్బందిగా మారిందని వాపోయాడు. మల్లారెడ్డిపల్లి రీచు నిర్వాహకుల మధ్య నెలకొన్న విబేధాల కారణంగానే లారీల రాకపోకలను నిలువరించారని గ్రామస్థులు అంటున్నారు. రోడ్లు కూడా నాశనమై పోతున్నందున పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు.