మ్యూల్ ఖాతాల్లో బ్యాంకు యంత్రాంగం భాగస్వామ్యం…

రూ. 138 కోట్ల లావాదేవీలు ట్రేస్…

13 మంది అరెస్ట్: సీపీ గౌష్ ఆలం…

దిశ దశ, కరీంనగర్:

సైబర్ నేరగాళ్లు ఆర్థిక లావాదేవీలు జరుపుకునేందుకు మ్యూల్ ఖాతాలు కీలకంగా మారాయి. వివిధ బ్యాంకుల్లో అకౌంట్లను ఓపెన్ చేసిన ఖాతాదారులు కమిషన్ల కోసం కక్కుర్తి పుడుతన్నారని ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చింది. తాజాగా మరో విషయం కూడా వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. అంతర్జాతీయ సైబర్ నేరగాళ్ల కోసం బ్యాంకు యంత్రాంగం కూడా తమ వంతు సహాకారం అందిస్తోంది. కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు సైబర్ నెట్ వర్క్ గుట్టు రట్టు చేయడంతో ఈ విషయం బయట పడింది.

ఆపరేషన్ క్రాక్ డౌన్…

కరీంనగర్ సీపీ గౌష్ ఆలం సైబర్ క్రిమినల్ ముఠా వివరాలను వెల్లడించారు. ఈ మేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సీపీ మ్యూల్ ఖాతాల ద్వారా సైబర్ నేరగాళ్లు డబ్బులు దోచుకుంటున్నారని స్పష్టం చేశారు. కమిషన్ల కోసం కక్కుర్తి పడి సామాన్యులు బలి కావద్దని, సైబర్ నేరాలకు సంబంధించిన వివరాలను www.cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. కమిషన్ల కోసం అకౌంట్లు ఓపెన్ చేసిన వారిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నవిషయం గుర్తు పెట్టుకోవాలని సీపీ హెచ్చరించారు. సైబర్ క్రిమినల్ ముఠాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. తాజాగా సైబర్ నేరగాళ్లు జరిపిన రూ. 138 కోట్ల మేర ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన స్కామ్ గుర్తించామని సీపీ ప్రకటించారు. 24 మంది నిందితుల్లో 13 మందిని అరెస్ట్ చేశామన్నారు.

బ్యాంక్ మేనేజర్…

కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో బ్యాంక్ మేనేజర్, క్యాషీయర్ ల భాగస్వామ్యం కూడా ఉండడం సంచలనంగా మారింది. రత్నాకర్ బ్యాంకులో(RBL) మేనేజర్ గా పని చేస్తున్న హన్మకొండ వాసి భువనగిరి కళ్యాణ్ (52), క్యాషీయర్ అయేషా బేగం (30)ల ప్రమేయం కూడా ఉన్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది. రత్నాకర్ బ్యాంక్ ఉద్యోగులు కూడా మ్యూల్ ఖాతాల్లో తమ వంతు చేయూతనందిస్తూ అంతర్జాతీయ సైబర్ క్రిమినల్ గ్యాంగ్ లకు సహకరిస్తున్నట్టుగా గుర్తించడంతో పోలీసులు వీరిపైన కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కరీంనగర్ సీపీ గౌష్ ఆలం వివరించిన నిందితుల వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా వెల్గటూరుకుచెందిన బండారి సాయిరాం(30), బుగ్గారం మండలం గోపులాపూర్ కు చెందిన అనుమండ్ల రంజిత్ (36), పెద్దపల్లి జిల్లా ధర్మారంకు చెందిన అలిగేటి మల్లేశం (37), జగిత్యాలకు చెందిన బోగ రాకేష్ (35), కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరకు చెందిన బండి ప్రణయ్, RBL బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తున్న హన్మకొండ వాసి భువనగిరి కళ్యాణ్ (52), క్యాషీయర్ అయేషా బేగం (30), మ్యూల్ అకౌంట్లు ఓపెన్ చేసిన ఖాతాదారులు పెద్దపల్లి జిల్లా ధర్మారంకు చెందిన విబూది రాంకుమార్ (37), జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ కు చెందిన నతర్ల శ్రీనివాస్ (39), వరంగల్ కు చెందిన కర్రె రాజు (35), జగిత్యాలకు చెందిన కల్లెడ మహేందర్ (36), జగిత్యాలకు చెందిన కొండ్ర నరహరి (37), కల్లెడ రాజేష్ (27)లను అరెస్ట్ చేశారు. వర్చువల్ ఖాతాల ద్వారా రూ. 12,25,31,665 బ్యాంక్ మ్యూల్ ఖాతాల ద్వారా రూ. 125,80,71,688 మేర లావాదేవీలు జరిగినట్టుగా గుర్తించామని సీపీ ప్రకటించారు. మొత్తం రూ. 138 కోట్ల మేర నగదు అంతర్జాతీయ సైబర్ క్రిమినల్స్ గ్యాంగులకు చేరాయని తేలిందన్నారు.