అస్మదీయులుగా మల్చుకునే ప్రయత్రాలు…
మొదటి విడత చర్చలు… అసెంబ్లీ తరువాత మళ్లీ భేటీ…
దిశ దశ, కరీంనగర్:
హుజురాబాద్ బీఆర్ఎస్ పార్టీ అసమ్మతీయులను అస్మదీయులుగా మల్చుకునే పనిలో నిమగ్నం అయ్యారుఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. తనకు వ్యతిరేకంగా సమావేశాలు జరగుతున్నట్టుగా బయట పడడంతో దిద్దబాటు చర్యలకు శ్రీకారం చుట్టారు. ఆదివారం సాయంత్రం హుజురాబాద్ లో అసమ్మతీ నాయకులతో భేటీ అయిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అర్థరాత్రి వరకూ చర్చలు జరిపారు.
క్యాడర్ లీడర్ మధ్య గ్యాప్…
వ్యక్తిగత ప్రాధాన్యతలను పక్కన పెట్టి పార్టీకి లాభం చేకూరే విధంగా నడుచుకోవల్సిన అవసరం ఉందని కౌశిక్ రెడ్డికి పలువురు సూచించినట్టుగా తెలుస్తోంది. వీణవంక్ ఎపిసోడ్ కూడా తీరని నష్టాన్ని చేకూర్చుందని, క్యాడర్ కు లీడర్ కు మధ్య ఏర్పడిన గ్యాప్ తగ్గించుకునేందుకు చొరవ తీసుకోవల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం చేసినట్టుగా సమాచారం. తరుచూ నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలతో మమేకం కావల్సిన అవసరం ఉందని, స్థానికంగా అందుబాటులో లేని సమయంలో హుజురాబాద్ నాయకులతో పాటు ముఖ్యమైన వారితో కాంటాక్టులో ఉండాల్సిన అవసరం కూడా ఉందని సూచించినట్టుగా సమాచారం. పార్టీకి లాభం జరిగే విధంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టుకుంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. తాము పార్టీని వదిలిపోయే ఆలోచనలో లేము కానీ స్థానిక నాయకులపై చూపుతున్న వివక్షలో మార్పు వచ్చినట్టయితే బావుంటుందని సూచించారు కొంతమంది నాయకులు.
తొలి భేటీ…
అయితే కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా హుజురాబాద్ బీఆర్ఎస్ నాయకులు జట్టు కడుతున్న విషయం తెలిసిన వెంటనే కార్యరంగంలోకి దిగారు. అందుబాటులో ఉన్న వారితో వ్యక్తిగతంగా చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలకు హాజరు కావల్సి ఉన్న నేపథ్యంలో మరోసారి పూర్తి స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసుకుని అభిప్రాయబేధాలు సమసిపోయే విధంగా చర్చించుకునే ఆలోచనలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత వ్యతిరేకత ప్రదర్శించిన ప్రతి నాయకునితో మాట్లాడి వివాదం సద్దుమణిగే విధంగా నడుచుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. స్థానిక నాయకులు చెప్పినట్టుగానే హుజురాబద్ ప్రజలతో, క్యాడర్ తో కలిసిపోయేందుకు ప్రాధాన్యత ఇస్తానని కౌశిక్ రెడ్డి మాట ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

