మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రకటన…
దిశ దశ, జగిత్యాల:
మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో అనుబంధానికిక గుడ్ బై చెప్పేస్తున్నారు. 42 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన పార్టీకి, పదవికి రాజీనామా చేయనున్నట్టు వెల్లడించారు. ఆదివారం జగిత్యాలలో మీడియాతో మాట్లాడిన ఆయన తనకీ పరిస్థితి ఎదురు కావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒకరని కామెంట్ చేశారు. పార్టీలో ఎన్నో అవమానాలకు గురయ్యాయనని, ఇక ఆ క్షోభ భరించలేనని స్పష్టం చేశారు. పార్టీలో తనకు గౌరవం లేకుండా పోయిన ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం తనవల్ల కాదని తేల్చి చెప్పారు. ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నానని, అదే రోజున బండారి గార్డెన్స్ లో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు జీవన్ రెడ్డి. దశాబ్దాలుగా నాతో కలిసి నడుస్తున్న క్యాడర్ కలిగి ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని 25 వారితో చర్చలు జరిపిన తరువాతే తాను ఏం చేయబోతున్నానో ప్రకటిస్తానన్నారు. శాసన మండలిలో ఒంటరిగా, అధికారంలో ఉన్నా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేశానని జీవన్ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష పార్టీలో కొనసాగుతూ ఉద్యమాలు చేసిన తానిప్పుడు అధికార పక్షంలో హక్కులు కాలరాసే విధంగ వ్యవహరిస్తున్న తీరును భరించే పరిస్థితి లేదన్నారు. తెలంగాణాలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపుల ప్రభావం దేశ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీపై పడుతుందని, రాహుల్ గాంధీపై తీవ్రంగా ఉంటుందన్నారు. చివరి శ్వాస వరకూ జగిత్యాలతో అనుభంధం కొనసాగుతుందని, తన అనుబంధాన్ని ఎవరూ తెంచలేరని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపుల అంశం జరిగినప్పుడు, ఎమ్మెల్సీ అవకాశం మరోసారి రాకున్నా 20 నెలలుగా సర్దుకపోయానన్నారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను పార్టీ అంతర్గత వ్యవహారాలకు దూరంగా ఉంచగలరా అని ప్రశ్నించిన జీవన్ రెడ్డి తన సమస్య పరిష్కరించే అవకాశం లేకుండా పోయిందన్నారు.
ప్రాజెక్టులపై నిర్లక్ష్యం
రాష్ట్రంలో ప్రాజెక్టులపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు. ఆదిలాబాద్ నుండి రంగారెడ్డి జిల్లా వరకూ తాగు, సాగు నీరందించడంతో పాటు పారిశ్రామిక అవసరాలకు ఆధారం అయిన ప్రాణహిత, చెవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభం చేయలేదన్నారు. తుమ్మడిహడ్డీ నిర్మాణం విషయంలో జరుగుతున్న జాప్యం వల్ల ఉత్తర తెలంగాణపై తీవ్రమైన కరువు తలెత్తే ప్రమాదం ఉందని జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మేడిగడ్డను పునరుద్దరణ చేయడం లేదని కాంట్రాక్టర్ మరమ్మత్తులు చేయకపోతే ప్రభుత్వమే బాగు చేయించి నిర్మాణ సంస్థపై క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. అయినా కూడా మేడిగడ్డ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు.

