దిశ దశ, జగిత్యాల:
మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డిని ఒప్పించే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం చేస్తున్న ప్రయత్నాలు విఫలం అవుతున్నట్టుగా ఉంది. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు జీవన్ రెడ్డితో చర్చలు జరిపినప్పటికీ ఆయన మాత్రం వెనడుగు వేసేందుకు ససేమిరా అంటున్నారు. తాజాగా ఆయనకు అత్యంత సన్నిహితుడు, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును కూడా రంగంలోకి దింపినప్పటికీ సానుకూల ఫలితం రానట్టుగా సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో జీవన్ రెడ్డిని సముదాయించే విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు అన్ని కూడా విఫలం అవుతున్నట్టుగానే ఉంది.

శ్రీధర్ బాబు భేటీ…
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శనివారం హైదరాబాద్ నుండి నేరుగా జగిత్యాలకు చేరుకున్నారు. మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంలు కూడా మంత్రి శ్రీధర్ బాబుతో ఉన్నారు. దాదాపు గంటకుపైగా జరిగిన చర్చల్లో జీవన్ రెడ్డి మాత్రం పార్టీని వీడడం ఖాయం అన్న సంకేతాలే ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పార్టీ పరంగా అన్ని రకాలుగా అండదండలు ఉంటాయని పార్టీలోనే కొనసాగాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించినప్పటికీ జీవన్ రెడ్డి తనపై చూపిన వివక్ష గురించి ఎకరవు పెట్టినట్టుగా శ్రీధర్ బాబు మీడియాతో చేసిన వ్యాఖ్యలను బట్టి స్పష్టం అవుతోంది. జీవన్ రెడ్డి కినుక వహించిన తొలినాళ్లలో కూడా శ్రీధర్ బాబు జీవన్ రెడ్డితో చర్చలు జరిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడినప్పుడు జీవన్ రెడ్డి పార్టీలోనే ఉంటారని ప్రకటించారు. ఈ సారి మాత్రం జీవన్ రెడ్డి చెప్పిన విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని మాత్రమే ప్రకటించడం గమనార్హం.
అదిష్టానం దృష్టికి: శ్రీధర్ బాబు…
జీవన్ రెడ్డిని తాము కలిసేందుకు వచ్చామని ఈ సందర్భంగా జరిగిన చర్చల విషయాలను అధిష్టానం దృష్టికి, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి వివరించనున్నామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వివరించారు. శనివారం జగిత్యాలలో జీవన్ రెడ్డితో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… జీవన్ రెడ్డికి అండగా ఉండేందుకు పార్టీ ఆలోచన చేస్తోందని, ఆయనను ఏ నిర్ణయమూ తీసుకోకూడదని కోరామన్నారు. 10 మంది ఎమ్మెల్యేలను తీసుకోవడానికి కారణం అభివృద్ది కోసమేనని, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల గొంతుకగా జీవన్ రెడ్డి ఉన్నారన్నారు. ఆయన బాధ పడితే తామూ బాధ పడతామని, తెలంగాణాలో ఆయనంటే తెలియని వారు ఎవరూ ఉండరన్నారు. పార్టీకి చెందిన సీనియర్లు కూడా జీవన్ రెడ్డితో ఇప్పటికే మాట్లాడారన్నారు.

దేవుడు శాసిస్తాడు…
మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంలతో భేటీ అనంతరం మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దేవుడు శాసిస్తే మానవుడు అనుసరిస్తాడని ఆయన చేసిన కామెంట్ వైరల్ గా మారింది. మంత్రులతో జరిగిన చర్చలు విఫలం అయినట్టేనన్న సంకేతాలను జీవన్ రెడ్డి ఇచ్చారన్న చర్చ స్థానికంగా సాగుతోంది. పార్టీకి రాజీనామా చేయడం, మరో పార్టీలో చేరడానికి సంబంధించిన ప్రక్రియ అంతా ముగిసిపోవడం, ముహుర్తాలు కూడా పిక్స్ చేసుకున్న ఈ తరుణంలో కాంగ్రెస్ అధిష్టానం పార్టీని వీడవద్దన్న ప్రతిపాదనలు పంపిస్తుండడం జీవన్ రెడ్డితో పాటు ఆయన వర్గీయులను అసహనానికి గురి చేస్తున్నట్టుగా ఉంది. జీవన్ రెడ్డి వద్దకు వచ్చింది శ్రీధర్ బాబు కావడంతో ప్రతికూలతను ప్రదర్శించనప్పటికీ ఆయన అనుచరులు మాత్రం పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. తమ నేతను అన్నింటా అవమానాలకు గురి చేసి ఇప్పుడు పార్టీ మారవద్దంటూ సముదాయించే ప్రయత్నాలు చేస్తుండడం సరైంది కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

