దిశ దశ, కరీంనగర్:
ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టుకోలేడన్న ధీమానో లేక తామేం చేసినా చెల్లుతుందన్న అతి నమ్మకమో తెలియదు కానీ… ఏకంగా కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ కేంద్రంగానే సర్కారు ఖజానకు కన్నం వేశారు. నాలుగేళ్ల పాటు గుట్టుగా సాగిన ఈ వ్యవహారం గురించి పోలీసు అధికారులు ఆరా తీయడంతో బట్ట బయలు అయింది. కూపీ లాగుతున్న పోలీసు అధికారులు ఇప్పటి వరకు ఈ కేసులో ఐదుగురి పాత్ర ఉన్నట్టుగా తేల్చారు. టాస్క్ ఫోర్స్ ఏసీపీ వాసాల సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో హెడ్ కానిస్టేబుల్ నీలం రామ్మోహన్, రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వై.వి. మునిరామయ్య, నకిలీ అకౌంట్లు సృష్టించిన లావుడ్యా రవి (42), చుక్క గంగరాజు (33), శంకర్ నామతాబాబ్ (46)లను అరెస్ట్ చేశామని సీపీ గౌష్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో కమిషనరేట్ పోలీస్ ఆఫీసులో పనిచేసి ప్రస్తుతం చిగురుమామిడిలో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న నీలం రామ్మోహన్ మరణించిన కానిస్టేబుళ్ల సిహెచ్ రవిందర్, కె గంగస్వామి, కె రవిలకు సంబంధించిన ఎంప్లాయిస్ ఐడీలను సేకరించి వీరి పేర్లకు బదులుగా లావుడ్యా రవి, చుక్కా గంగరాజు, శంకర్ నామతాబాబ్ ల పేర్లతో కరీంనగర్ భగత్ నగర్, బొమ్మకల్ HDFC బ్యాంకు బ్రాంచ్ లలో అకౌంట్లను ఓపెన్ చేశారు. ఈ ఖాతాలకు తన మెయిల్ ఐడీలు, ఫోన్ నంబర్లను లింక్ చేసి జూన్ 2022 నుండి 2026 మార్చి వరకు జీతాలను జమ చేయించుకున్నాడు. ఈ మూడు అకౌంట్లలో మరణించిన కానిస్టేబుళ్లకు సంబంధించిన వేతనాలు యాడ్ కాగానే ఏటీఎంల ద్వారా డ్రా చేయడం కానీ, IMPS ద్వారా తన పర్సనల్ అకౌంట్ కు బదిలీ చేసుకునేవాడు. అయితే నీలం రామ్మోహన్ వేతనాలు తీసుకోవడంతోనే సరిపెట్టకుండా సదరు అకౌంట్లపై రుణాలు కూడా తీసుకుని EMI ద్వారా చెల్లించేవాడు. ఈ కుట్ర కేసులో నీలం రామ్మోహన్ (52), AO ముని రామయ్య (61), ప్రైవేటు వ్యక్తులు లావుడ్యా రవి (42), చుక్క గంగారుజ (33), శంకర్ నామతాబాబ్ (46)లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. నీలం రామ్మోహన్ వద్ద 341.1 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 5 లక్షల నగదు, మునిరామయ్య వద్ద ఒక మొబైల్ ఫోన్, రూ. 18 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఒంటి చేత్తో…
కమిషనరేట్ పొలీస్ ఆఫీస్ (CPO) నుండే పోలీసు యంత్రాంగం వేతనాలు, ఇంక్రి మెంట్లు, టీఏలు, డీఏల, పనిష్మెంట్ కు గురైన వారి వేతనాల్లో కోత ఇలా ప్రతి అంశానికి సంబంధించిన వివరాలతో కూడిన ఫైళ్లు కదులుతుంటాయి. అడ్మినిస్టేటివ్ ఆఫీస్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి నిర్వహిస్తుంటారు. మరణించిన వారి వివరాలు, బదిలీ అయిన వారి వివరాలు వారి ఐడీ నెంబర్లు ఇలా ప్రతి అంశంపై సవివరంగా ఫైళ్లు తయారు చేసి అందుకు అనుగుణంగా జీత భత్యాలకు సంబంధించిన బిల్లులు సిద్దం చేస్తారు. అయితే CPO ఆఫీసులో కంప్యూటర్ సిస్టం ఆపరేటింగ్ చేసిన హెడ్ కానిస్టేబుల్ నీలం రామ్మోహన్ ఒంటి చేత్తో అన్ని వ్యవహారాలు చక్కదిద్దేవాడన్న ప్రచారం జరుగుతోంది. అటాచ్ మెంట్ పై వచ్చిన ఈయన 25 నుండి 30 ఏళ్లుగా సీపీఓలో రాజ్యం ఏలుతున్నాడని అతనికే కీలకమైన బాధ్యతలు అప్పగించినట్టుగా తెలుస్తోంది. అన్ని విషయాల్లోనూ ఆయన జోక్యం చేసుకునేంత స్వేచ్ఛ లభించిందన్న చర్చ స్థానికంగా సాగుతోంది. మరో వైపున ఆర్థిక వ్యవహారాల విషయంలో CPO కార్యాలయంలో ‘‘B’’ ‘‘P’’ సెక్షన్లు కీలకంగా పని చేయాల్సి ఉంటుంది. బడ్జెట్ కెటాయింపుల వ్యవహారాలు చూసే ‘‘B’’ సెక్షన్, జీత భత్యాలు అందించేందుకు పేమెంట్ ‘‘P’’ సెక్షన్లు కీలకంగా వ్యవహరిస్తాయి. అయితే పోలీసు విభాగంలో మరణించిన పోలీసు అధికారే అయినా సిబ్బంది అయినా సీపీఓ కార్యాలయం నుండే ఫైళ్లు కదులుతుంటాయి. ఎప్పటికప్పుడు ఈ వివరాలను అప్ డేట్ చేసుకున్న తరువాత వేతనాలకు సంబంధించిన బిల్లులు సంబంధిత సెక్షన్ ఉద్యోగుల చేతుల మీదుగా సాగుతుంటాయి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే… ముగ్గురు కానిస్టేబళ్లుకు సంబంధించిన ఐడీలతో నాలుగేళ్లుగా వేతనాలు డ్రా అవుతున్నా ఎందుకు పట్టించుకోలేదన్నదే మిస్టరీగా మారిపోయింది. AOతో పాటు సెక్షన్ సూపరింటిండెంట్లు, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు కూడా ఫైళ్లను పరిశీలించి సంతకాలు చేస్తుంటారు. వీరంతా మరణించిన కానిస్టేబుళ్ల పేరిట వేతనాలు డ్రా అవుతున్నాయన్న విషయం గురించి గుర్తించకపోవడం ఏంటన్నదే అంతు చిక్కకుండా పోతోంది. పోలీసు సిబ్బంది చనిపోయిన విషయం గురించి సీపీఓ కార్యాలయానికి సమాచారం వచ్చిన తరువాత వారి ఐడీలను బ్లాకులో పెట్టి, నామినీల పేరిట బెనిఫిట్స్, వేతనాలు, పెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. మరణించిన పోలీసు యంత్రాంగానికి సంబంధించిన బెనిఫిట్స్ కూడా సీపీ లేదా ఎస్పీల చేతుల మీదుగానే వారి కుటుంబాలకు ఇచ్చే సాంప్రాదాయం కొనసాగుతోంది. అయితే కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని ముగ్గురు కానిస్టేబుళ్లు మరణించిన విషయం ఉన్నతాధికారికి తెలిసినా కూడా CPO యంత్రాంగం దర్జాగా వేతనాలు డ్రా చేసుకునేంత సాహసం చేయడం ఏంటన్నదే మిస్టరీగా మారింది.

