డంపింగ్ యార్డ్… వాటర్ ట్యాంక్స్… చల్లారని మంటలు…

దిశ దశ, కరీంనగర్:

దశాబ్దాల పాటు వేసిన చెత్త అక్కడ గుట్టలా పేరుకపోయింది. అక్కడి నుండి నిరంతరం మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. సమీప కాలనీల కుటుంబాలు పొగలోనే జీవనం సాగిస్తూనే ఉన్నాయి. నియంత్రించేందుకు కార్పొరేషన్ చేస్తున్న ప్రయత్నాలు వృథా ప్రయాసే అన్నట్టుగా మారిపోతోంది. కరీంనగర్ వాసుల సహనాన్ని పరీక్షిస్తున్న డంప్ యార్డ్ లో మంటలకు కారణమేంటీ..? ప్రకటనలకే పరిమితమైన నినాదాలు ఆచరణలో సఫలం అయ్యాయా..?

నినాదాలు ఇలా…

రోజు రోజుకు విస్తరిస్తున్న నగరం కరీంనగర్. ఇక్కడ పేరుకపోతున్న చెత్త లక్షలాది మెట్రిక్ టన్నులకు చేరుకుంది. దశాబ్దాల క్రితం మానేరు నది తీరంలో చెత్త వేయడం మొదలు పెట్టిన మునిసిపాలిటీ అక్కడ పేరుకపోతున్న చెత్తతో నగర వాసుల పరిస్థితి ఏంటన్న విషయంపై దృష్టి సారించలేకపోయింది. దీంతో ఇప్పుడు కార్పొరేషన్ కే సవాల్ విసురుతున్న పరిస్థితి తయారైంది. తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా సేకరించాలని ఆర్భాటంగా ప్రారంభించిన మునిసిపాలిటీ ఆచరణలో అమలు చేయడంలో పూర్తిగా విఫలం అయింది. ఇంటింటికి రెండు చెత్త బుట్టలను కూడా పంపిణీ చేసినా లాభం లేకుండా పోయింది. చివరకు డంపింగ్ యార్డు వద్దకు చేరేసరికి తడి, పొడి చెత్త రెండు ఒకేచోటకు చేరిపోయాయి. తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా సేకరించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు పలు రకాల చర్యలు తీసుకున్నట్టుగా ప్రచారం చేసినప్పటికీ చివరకు ఫలితం మాత్రం రాకుండా పోయింది.

మంటలు…

డంపింగ్ యార్డులో నివురుగప్పు చెలరేగిపోతుండడంతో సమీప కాలనీల వాసులు జీవించడమే గగనంగా మారిపోయింది. తడి చెత్త మురిగిపోయిన తరువాత మిథేన్ గా మారుతుందని, చెత్త లోపలి భాగంలో ఉన్న వేడితో మంటలు చెలరేగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ మంటల కారణంగా సమీప కాలనీలన్ని కూడా పొగచూరిపోతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల వాసులు అనారోగ్యానికి గురవుతున్నారు. అయితే ఈ డంప్ యార్డుకు చెత్తను తరలించే ప్రక్రియకు బ్రేకులు వేస్తే తప్ప మంటలు చెలరేగడం ఆగదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

కంటి తుడుపు…

డంపింగ్ యార్డు నుండి వెలువడుతున్న మంటలను నియంత్రించేందుకు శాశ్వత పరిష్కారం కోసం మునిసిపల్ యంత్రాంగం చొరవ తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ మంటలను నియంత్రించేందుకు ప్రత్యేకంగా వాటర్ ట్యాంకర్లను ఏర్పాటు చేసి నీటిని పిచికారి చేయిస్తున్నారు. రెండు నుండి మూడు ట్రాక్టర్లు డంపింగ్ యార్డులోని మంటలను నిలువరించేందుక నీటిని సరఫరా చేస్తున్నట్టుగా సమాచారం. రోజుకు ఐధు నుండి పది ట్రిప్పుల చొప్పున నీటిని డంపింగ్ యార్డు చేరవేస్తున్నట్టుగా తెలుస్తోంది. యార్డులో మంటలు వ్యాప్తి చెందకుండా నిరంతరం ఈ ట్యాంకర్ల నీటిని పోసే విధానాన్ని అవలంభిస్తున్నారు. అయితే దీనివల్ల మాత్రం మంటలు ఆగేపరిస్థితి మాత్రం కనిపించడం లేదు. ట్యాంకర్ల ద్వారా నీటిని చెత్తపై చల్లుతున్నా రోజూ పొగ సమీప కాలనీల్లోకి వస్తూనే ఉంది. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్న సానుకూల ఫలితం రావడం లేదన్న విషయం స్పష్టం అవుతున్నది. ఇలాంటి చర్యల వల్ల మునిసిపాలిటీపై ఆర్థిక భారం పడడమే తప్ప పరిష్కారం మాత్రం దొరకడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.