దిశ దశ, కరీంనగర్:
గ్రానైట్ క్వారీలలో అక్రమాలపై విచారించేందుకు CBCID అధికారుల బృందాలు రంగంలోకి దిగాయి. కరీంనగర్ మైన్స్ అసిస్టెంట్ డైరక్టర్ (AD) ఆఫీసులో రికార్డులు సేకరించారు. రాష్ట్రంలో మైనింగ్ అక్రమాలపై CBCID విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు క్యాబినెట్ మీటింగులో కూడా నిర్ణయం తీసుకుని విచారణ బాధ్యతలు CBCIDకి అప్పగించింది ప్రభుత్వం. 2014 నుండి ఇప్పటి వరకు జరిగిన మైనింగ్ అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రంలో మైనింగ్ విస్తరించి ఉన్న జిల్లాల్లో విచారణ జరిపేందుకు CBCID రంగం సిద్దం చేసింది. ఇందులో భాగంగా కరీంనగర్ మైనింగ్ ఏడీ కార్యాలయంలో CBCID అధికారులు జిల్లాలోని మైన్స్ వివరాలను సేకరించినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలోని కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం మహబూబాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో జరిగిన మైనింగ్ అక్రమాలపై అధికారులు దర్యాప్తు చేయనున్నారు. క్వారీల లీజుల బదిలీలు, గ్రానైట్ సీనరేజ్ ఎగవేత, అనుమతి లేని ప్రాంతాల్లో తవ్వకాలు, లీజు తీసుకున్న మేరకే తవ్వకాలు జరిపారా, పదేళ్లలో గ్రానైట్ క్వారీల నుండి రవాణా అయిన మెటిరియల్ వివరాలను సమగ్రంగా తెలుసుకోనున్నట్టు సమాచారం. కరీంనగర్ జిల్లాలో విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఇచ్చిన అప్రైజల్ రిపోర్ట్ ఆధారంగా కూడా ఆరా తీయనున్నట్టుగా సమాచారం. గ్రానైట్ రవాణాకు సీనరేజ్ చెల్లింపులకు మధ్య వ్యత్యాసం ఉందా అన్న వివరాలు కూడా తెలుసుకునేందుకు, రైల్వే విభాగం, విదేశాలకు తరలివెళ్లిన గ్రానైట్ ఏఏ పోర్టుల నుండి వెల్లింది..? ఆయా పోర్టులకు ఎంతమేర రవాణా ఛార్జీలు చెల్లించారు..? వాటి పరిమాణం ఎంత తదితర వివరాలు సేకరించి ప్రభుత్వానికి అందిన రాయల్టీ ఎంత వచ్చిందో కూడా తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. వీటన్నింటిని క్రోడీకరించి ప్రభుత్వానికి ఎంతమేర నష్టం వాటిల్లిందో తేల్చనున్నట్టుగా సమాచారం. కొన్ని ప్రాంతాల్లో క్వారీలను కూడా CBCID అధికారుల బృందాలు పరిశీలించినట్టుగా తెలుస్తోంది. అన్ని ప్రాంతాల్లోని గ్రానైట్ క్వారీలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఆయా క్వారీల ఆర్థిక లావాదేవీలపై కూడా దృష్టి సారించనున్నట్టు సమాచారం.


