సమరానికి సై… డంప్ యార్డ్ పై బండి సంజయ్..

దిశ దశ, హుజురాబాద్:

హుజురాబాద్ శివార్లలో రెండు కార్పొరేషన్లు, ఏడు మునిసిపాలిటీలకు సంబంధించిన చెత్తను తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. ఓ వైపున స్థానికులు నిరసనలు తెలుపుతుంటే మరో వైపున బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కూడా ప్రజల డిమాండ్ కు అనుగుణంగా పోరాటాలు చేస్తామని ప్రకటిస్తున్నాయి. తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ డంప్ యార్డ్ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించి ప్రభుత్వంపై దుమ్మెుత్తిపోశారు.

ఉద్యమమే…

హుజురాబాద్ సమీపంలో ఏర్పాటు చేయాలనుకున్న డంపింగ్ యార్డ్ ను తాము మొదటి నుండి వ్యతిరేకిస్తున్నామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుమ్లాపూర్ సభలో ప్రసంగించిన తరువాత తానే అభ్యంతరం తెలిపానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ప్రతిపాదనలు చేస్తే ఈ ప్రభుత్వం డంప్ యార్డ్ ఏర్పాటు చేస్తోందని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే ఇందుకు కారణమని ఆరోపించారు. జనవాసాల సమీపంలో డంప్ యార్డ్ ఏర్పాటు చేయడం ఏంటని..? చిత్త శుద్ది ఉన్నట్టయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డంప్ యార్డు ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. హుజురాబాద్ ప్రాంత వాసుల ఆందోళనలు గమనించి జనవాసాలు లేని చోట డంప్ యార్డ్ ఏర్పాటు చేయాలన్నారు. డంప్ యార్డ్ కు వ్యతిరేకంగా బీజేపీ ఉద్యమాలు చేస్తుందని, స్థానికుల ఆరోగ్యమే తమకు అత్యంత ముఖ్యమని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. గుట్టల్లో నివసించే వన్యప్రాణులు కూడా అంతరించిపోయే ప్రమాదం ఉంటుందన్నారు.