‘‘పోలీసు మామల స్క్వాడ్’’… ఎంట్రీ ఇచ్చిన ట్రాఫిక్ ఎస్సై…

దిశ దశ, గోదావరిఖని:

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టే పోలీసుల నుండి తప్పించుకునేందుకు మందుబాబులు ఓ వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. అందులో డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ గురించి లైవ్ అప్ డేట్స్ షేర్ చేస్తున్నారు. ఈ సమాచారం అందగానే మందు బాబులు మరో దారి గుండి వెళ్లిపోతున్నారు. మద్యం ప్రియులు ట్రాఫిక్ పోలీసుల కదలికలు తెలుసుకుంటూ తప్పించుకుంటున్నారన్న సమాచారం అందుకున్నప్పటికీ రెడ్ హైండెడ్ గా పట్టుకోలేకపోయారు. అనూహ్యంగా ఓ ఆటో వాలను తనిఖీ చేస్తున్నప్పుడు వాట్సప్ గ్రూప్ గుట్టు తెలిసింది.

పోలీసు మామల స్క్వాడ్…

తెలంగాణాలోనే కార్మిక క్షేత్రాల్లో ఒకటిగా భాసిల్లితున్న రామగుండంలో మద్యం అమ్మకాలు ఎక్కువగానే జరుగుతుంటాయి. సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, బీపీఎల్ పవర్ హౌజ్ లతో పాటు చిన్న చితక పరిశ్రమలు కూడా ఇక్కడ ఉన్నాయి. దీంతో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న సమయంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడం కూడా ఇక్కడ సాధారణంగా మారిపోయింది. దీంతో రామగుండం ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ డ్రైవ్ (DD) తనిఖీలు ఎక్కువగా చేస్తుంటారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు స్పెషల్ ఆపరేషన్లు చేస్తుంటారు. సాయంత్రం అయిందంటే చాలు పోలీసులు రామగుండం, గోదావరిఖని పట్టణాల్లోని ఏదో ఒక కూడలిలో DD చెకింగ్ చేస్తుంటారు. మందుబాబులను పట్టుకున్న తరువాత పోలీసులు వారిని కోర్టుకు పంపడం, కౌన్సిలింగ్ నిర్వహించడం సాధారణంగా జరిగే ప్రక్రియనే. దీంతో ట్రాఫిక్ పోలీసుల DD చెకింగ్ నుండి తప్పించుకునేందుకు ఏకంగా ఓ వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. ‘‘పోలీస్ మామల స్క్వాడ్’’ పేరిట ఏర్పాటు చేసిన ఈ గ్రూపులో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఎక్కడ జరుగుతున్నాయో అప్ డేట్ చేయడం మొదలు పెట్టారు. ట్రాఫిక్ ఎస్సై హరి శంకర్ ఆటోవాలను తనిఖీ చేస్తున్నప్పుడు అతని మొబైల్ చెక్ చేసి గుర్తించారు. ఆటో వాలకు DD పరీక్ష నిర్వహించిన తరువాత అదే వాట్సప్ గ్రూప్ లోకి ఎంట్రీ ఇచ్చారు. మందుబాబులకు వార్నింగ్ ఇస్తూ ఎస్సై ఘాటుగా స్పందించారు. ఎస్సై హరి శంకర్ ఎంట్రీ ఇచ్చిన తరువాత ఒక్కొక్కరుగా సదరు వాట్సప్ గ్రూప్ నుండి ఎగ్జిట్ కావడం మొదలు పెట్టారు. మొత్తం 1024 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన ఈ గ్రూపు గుట్టును ట్రాఫిక్ పోలీసులు గుర్తించగానే గ్రూప్ అడ్మిన్ కూడా వెనక్కి తగ్గాడు. ట్రాఫిక్ పోలీసులు అనూహ్యంగా ఇచ్చిన ఝలక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గ్రూప్ ఏర్పాటు చేసుకుని తమ తనిఖీలకు చిక్కుకుండా తప్పించుకుంటున్న మందుబాబులకు జీవితం అంటే ఏంటో కూడా చెప్పకనే చెప్పారు ట్రాఫిక్ ఎస్సై హరి శంకర్. తాము పట్టుకున్నప్పడు జరిమానా నుండి తప్పించుకునేందుకు కానీ, ఇతరాత్ర మినహాయింపులు కల్పించేందుకు కానీ ఎవరో ఒకరితో ఫోన్లు చేయించుకే అవకాశం ఉంటుంది కానీ… రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ఎవరికీ ఫోన్ చేసే అవకాశం ఉండదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. ప్రమాదంలో వాహనం టైర్లు ఎక్కినప్పుడు ఫోన్లు చేసే పరిస్థితి ఉండదని జీవితాన్ని ఫణంగా పెట్టడమే తప్ప మరో దారి కనిపించదన్న విషయాన్ని గమనించాలని హరి శంకర్ హితవు పలికారు. ఎన్నో ప్రమాదాల్లో క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించినప్పుడు వారి రక్తంతో తన యూనిఫాం తడిచిపోయిన సందర్భాలు ఉన్నాయని, ఆ పరిస్థితి మిగతా వారికి రాకూదన్నదే తన తాపత్రయమని ప్రకటించారు. మరో వైపున పోలీసు మామల స్క్వాడ్ వాట్సప్ గ్రూప్ సభ్యులందరి వివరాలు సేకరించామని వారికి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇస్తామని ట్రాఫిక్ ఎస్సై హరిశంకర్ ప్రకటించారు.