పోలీసులకు చిక్కవద్దని… తప్పించుకునే ప్రయత్నంలో మరణించిన డ్రైవర్…

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ శివార్లలో సోమవారం తెల్లవారు జామున విషాద ఘటన చోటు చేసుకుంది. తనిఖీలు చేస్తున్న పోలీసులను గమనించి ఇసుక అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ పోలీసులకు చిక్కవద్దని తప్పించుకునే ప్రయత్నం చేశాడు డ్రైవర్. ఈ క్రమంలో ట్రాక్టర్ బోల్తాపడడంతో ఎగిరిపడిపోయి డ్రైవర్ చనిపోయాడు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… కరీంనగర్ శివార్లలో రూరల్ ఎస్ఐ నరేష్ పెట్రోలింగ్ డ్యూటీ చేస్తూ వాహనాలను తనిఖీ చేశాడు. సోమవారం తెల్లవారు జాము వరకు కరీంనగర్ బైపాస్ రోడ్డు మీదుగా గోపాల్ పూర్ జాతర వద్ద బందోబస్తు పర్యవేక్షించేందుకు వెళ్లారు. ఈ క్రమంలో గోపాలపూర్ సమీపంలోని హైవేపై ఇసుక ట్రాక్టర్లు కనిపించడంతో వాటిని నిలువరించాడు. ఇదే సమయంలో అటుగా వస్తున్న మరో ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ పోలీసులు పట్టుకుంటున్నారని గమనించి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. దుర్శేడు గ్రామ శివారులోని పంట పొలాల మీదుగా ట్రాక్టర్ లైట్ ఆఫ్ చేసి వెల్తుండగా బండరాయి అడ్డుగా రావడంతో డ్రైవింగ్ చేస్తున్న హరీష్ ఎగిరిపడిపోగా ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ఘటనలో గాయాలైన ట్రాక్టర్ డ్రైవర్ గున్నాల హరీష్ ను ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మరణించినట్టుగా సమాచారం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గొల్లపల్లి నుండి ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది.

పట్టుకుంటే…

పోలీసులు పట్టుకుంటే జరిమానా లేదా బైండోవర్ చేయడంతో సరిపోయేది. కానీ వారికి చిక్కకుండా తప్పించుకుని ప్రమాదానికి గురై డ్రైవర్ ప్రాణాలే కోల్పోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది. కరీంనగర్ రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అడ్డూ అదుపు…

కరీంనగర్ మీదుగా ప్రవహిస్తున్న వాగులు, వంకల్లోని ఇసుక తరలించేందుకు వందల సంఖ్యలో ట్రాక్టర్లు తయారయ్యాయి. తెల్లవారు జాము నుండి సమీప ప్రధాన రహదారుల మీదుగా ఇసుక ట్రాక్టర్ల రాకపోకలతో హోరెత్తిపోతోంది. ఇసుక తరలించే ట్రాక్టర్ల వేగాన్ని చూసి రహదారులపై నడిచి వెల్లే వారు కూడా జంకుతున్నారు.