ఇంటి దొంగల పనేనా..?
దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ నడి బొడ్డున మరో దోపిడీ జరిగింది. అగంతకులు ఓ ఇంట్లోకి చొరబడి భారీగా నగలు, నగదు దోచుకెళ్లిన ఘటన సంచలనంగా మారింది. కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భగత్ నగర్ లో నివాసం ఉంటున్న అజ్మత్ అలీ అనే వృద్దుడి ఇంట్లోకి చొరబడిన అగంతకులు మారణాయుధాలతో బెదిరించి 66 తులాల బంగారం, 10 తులాల వెండి, రూ. 21 లక్షల నగదు దోచుకెళ్లారు. మంగళవారం అర్థరాత్రి 12.30 గంటల ప్రాంతంలో దాదాపు ఎనిమిది మంది అగంతకులు మాస్కులు, గ్లౌజులు ధరించి అజ్మత్ అలీ ఇంట్లో దోపిడీకి పాల్పడ్డారు. అర్థరాత్రి ఇంటి సందులోని లైట్ ఆఫ్ చేసి ఇంట్లోకి వెల్తున్న క్రమంలో ఆయన నోటిని మూసి వేసి ఇంట్లోని ముగ్గురు మహిళల నోట్లో గుడ్డలు నొక్కి తుపాకులతో బెదిరించారు. ఈ క్రమంలో అజ్మత్ అలీపై దాడికి పాల్పడినట్టుగా బాధితులు చెప్తున్నారు. ఘటనా స్థలంలో వద్ద ఓ తుపాకి పడేసి వెళ్లడంతో దానిని పరిశీలించగా అది టాయ్ పిస్తోల్ గా గుర్తించినట్టు సమాచారం. అర్థరాత్రి దోపిడీకి పాల్పడేందుకు వచ్చిన వారంతా కూడా హిందీలో మాట్లాడినట్టుగా చెప్తున్నారు. దోపిడీ జరిగిన విధానాన్ని బట్టి గమనిస్తే మాత్రం అజ్మత్ అలీ ఇంటితో పాటు పరిసర ప్రాంతాలపై పరిపూర్ణమైన అవగాహన చేసుకున్నట్టుగా స్పష్టం అవుతోంది. అజ్మత్ అలీ రోజూ ఇంటి సందులో లైట్ ఆప్ చేసి ఇంట్లోకి వెళ్తుంటారు. ఇదే విషయంపై అవగాహన ఉన్న అగంతకులు ఇంటి సందులో దాక్కుని అతన్ని బెదిరించి దోపిడీకి పాల్పడినట్టుగా స్పష్టం అవుతోంది. సమాచారం అందుకున్న వెంటనే కరీంనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యప్తు చేస్తున్నారు. అయితే దోపిడీ అనంతరం అగంతకులు అజ్మత్ అలీ ఇంట్లో అద్దెకు ఉండే వారి రెండు బైకులు కూడా చోరీ చేసుకుని బైపాస్ రోడ్ మీదుగా పరార్ అయ్యారని సీసీ ఫుటేజీ అధారంగా గుర్తించారు పోలీసులు. దీనిని బట్టి దోపిడీ ముఠా అజ్మత్ అలీ ఇంటికి ఎలా చేరుకుందోనన్న విషయంపై స్పష్టత రావల్సి ఉంది. ఎదైనీ వాహనంలో వచ్చి అజ్మత్ అలీ ఇంటి సమీపంలో దిగి వాహనాన్ని కరీంనగర్ శివార్లలోకి పంపించారా లేక నడుచుకుంటూ వచ్చారా అన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
కుటుంబ తగాదాలు…?
అజ్మత్ అలీకి కరీంనగర్ లో వివిధ ప్రాంతాల్లో స్థిరాస్తులు ఉండడంతో పాటు ఆయన నివాసం ఉంటున్న భగత్ నగర్ లో కూడా కాంప్లెక్సులు ఉన్నాయి. తాను నివసిస్తున్న చోటే కూతుళ్లకు కూడా ఆస్తులు పంచి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆయన కొడుకులు కరీంనగర్ లోనే వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. అయితే అతని ఓ అల్లుడు కరీంనగర్ లోనే కొంతకాలం క్లాత్ స్టోర్స్ ఏర్పాటు చేసుకుని జీవించే వాడని ఇటీవలే కుటుంబ సభ్యులకు చెప్పా పెట్టకుండా వెళ్లిపోయాడని తెలుస్తోంది. ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ నివాసి అయిన ఆయన బంధువుల్లో ఒకరికి నేర చరిత్ర ఉన్నట్టుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. దోపిడీకి పాల్పడిన ముఠాలో ఉన్న వారంతా కూడా హిందీలో మాట్లాడడం… అజ్మత్ అలీ అల్లుడిది కూడా మీరట్ కావడంతో ఆ ప్రాంతం నుండి ఇక్కడకు దోపిడీ చేసేందుకు ప్రత్యేక ముఠాను ఏమైనా పంపించారా లేక నిజంగానే దోపిడీ ముఠానే ఆయన ఇంట్లోకి చొరబడిందా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. దోపిడీ ముఠానే అయినట్టయితే ఒక్క అజ్మత్ అలీ ఇంటినే లక్ష్యంగా చేసుకోవడానికి కారణేమేమై ఉంటుందన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అంతే కాకుండా ఆయన నివాసం ఉంటున్న భవనంలోని సందుపై కూడా అవగాహన ఉండడమేంటన్నదే మిస్టరీగా మారింది. ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని, ఇంట్లో వృద్దుడైన అజ్మత్ అలీ, ఆయన భార్య, ఇద్దరు కూతుర్లు నివాసం ఉంటున్నారన్న విషయం తెలిసిన వారే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.
టెక్నికల్ ఎవిడెన్స్…
ఇకపోతే కరీంనగర్ పోలీసులు సాంకేతికతను కూడా అందిపుచ్చుకుని దోపిడీ ముఠాను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. అజ్మత్ అలీ ఇంట్లో క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ తో పాటు ఇతర బృందాలు ఆదారలు సేకరించే పనిలో నిమగ్నం కాగా సీసీ ఫుటేజీ, మొబైల్ ట్రాకింగ్ తో పాటు ఇతరాత్ర టెక్నికల్ ఆధారాలు సేకరించేందుకు సైబర్ వింగ్ టీమ్ కూడా ఆరా తీస్తోంది.
సీపీ గౌష్ ఆలం…
భగత్ నగర్ లో దోపిడీకి గురైన ఇంటిని కరీంనగర్ సీపీ గౌష్ అలం, అడిషనల్ సీపీ వెంకట రమణ, ఏసీపీలు వెంకటస్వామి, విజయ్ కుమార్, సీఐలు రాంచదర్ రావు, తిరుమల్, పుల్లయ్యతో పాటు పలువురు పోలీసు అధికారులు సందర్శించారు. దోపిడీ జరిగిన తీరుపై సమగ్రంగా అడిగి తెలుసుకున్నారు.

